అన్నాడీఎంకే ఎంపీలకు నిరాశ తప్పదా?

10 Feb, 2017 15:41 IST|Sakshi
అన్నాడీఎంకే ఎంపీలకు నిరాశ తప్పదా?
తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరుతున్న అన్నాడీఎంకే ఎంపీలకు  తీవ్ర నిరాశే ఎదురుకానుంది. అన్నాడీఎంకే ఎంపీలు.. రాష్ట్రపతి జోక్యం కోరడం సమంజసం కాదని  రాష్ట్రపతి అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనిలో ప్రెసిడెంట్ పాత్ర స్వల్పమేనని, ప్రస్తుతం బంతి గవర్నర్ కోర్టులో ఉందని రాష్ట్రపతి రాజ్యాంగ సలహాదారు టీకే విశ్వనాథన్ చెప్పారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలని కోరుతూ అన్నాడీఎంకే ఎంపీలు రెండు రోజుల క్రితమే అభ్యర్థన పెట్టుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళతో ప్రమాణం చేయించకుండా ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు.
 
తమిళనాట రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రణబ్కు ఎలాంటి ప్రమేయం లేదని రాష్ట్రపతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు గవర్నర్ కాని, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కానీ ప్రణబ్కు ఫిర్యాదు చేయలేదని వెల్లడించాయి. ఇ‍ప్పటివరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే అంశం కూడా తెరపైకి రాలేదన్నాయి. అక్కడ ఆపద్ధర్మ సీఎంకు, అన్నాడీఎంకేకు అసెంబ్లీలో మెజార్టీ బలం ఉందని, ఒకవేళ 356 ఆర్టికల్ను విధించాలనే అంశమేమైనా తెరపైకి వస్తే, అప్పుడు ప్రెసిడెంట్ జోక్యం చేసుకుంటారని రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు చెబుతున్నాయి.  ఈ విషయంపై ప్రణబ్ కూడా ఇప్పటివరకు న్యాయ, రాజ్యాంగ నిపుణులను సంప్రదించలేదని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ విశ్వనాథన్ చెప్పారు.

తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠం కోసం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు పోరు తీవ్రతరం కావడంతో పార్టీలో, రాష్ట్రంలో ఒక్కసారిగా సంక్షోభం నెలకొంది. ఇరు వర్గాలు గురువారం గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశాయి. అనంతరం వారి అభిప్రాయాలతో కూడిన నివేదికను కేంద్రానికి గవర్నర్ పంపించారు.  
 
మరిన్ని వార్తలు