యోగిపై పిచ్చిరాతలు.. మండిపడ్డ భారత్

24 Mar, 2017 20:07 IST|Sakshi
యోగిపై పిచ్చిరాతలు.. మండిపడ్డ భారత్

యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడాన్ని విమర్శిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసిన సంపాదకీయంపై భారత సర్కారు తీవ్రంగా మండిపడింది. ఇలాంటి పిచ్చి రాతలు రాయడంలో పత్రిక తెలివితేటలను ఎవరైనా ప్రశ్నించవచ్చని చెప్పింది. 'హిందూ తీవ్రవాదులతో అంటకాగుతున్న మోదీ' అనే అర్థం వచ్చేలా న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఘాటుగా సంపాదకీయం రాసింది. 2014లో ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి నరేంద్రమోదీ తన పార్టీ యొక్క హిందూ పునాదులను మరింత బలోపేతం చేస్తున్నారని, అదే సమయంలో అభివృద్ధి, ఆర్థికవృద్ధి అనే లౌకికవాద లక్ష్యాలను ప్రమోట్ చేస్తున్నారని అందులో చెప్పింది. 'ఫైర్ బ్రాండ్ హిందూ పూజారి' అయిన యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం అనేది మతపరమైన మైనారిటీలకు పెద్ద షాక్ అని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా రాయడాన్ని కేంద్రం తీవ్రంగా నిరసించింది. ''సంపాదకీయాలు లేదా అభిప్రాయాలు విషయాన్ని బట్టి ఉంటాయి. ఈ సందర్భం కూడా అంతే. అయితే.. స్వదేశంలోనైనా పరాయి దేశంలోనైనా ప్రజాస్వామ్యంలో తీసుకునే నిర్ణయాలను, ప్రజల తీర్పును అనుమానిస్తే.. దాన్ని తప్పనిసరిగా ప్రశ్నించాల్సిందే''నని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి గోపాల్ బగ్లే వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు