కుబేర భారతం!

12 Sep, 2013 00:49 IST|Sakshi
కుబేర భారతం!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ, భారత్‌లో కుబేరులు మాత్రం పెరుగుతున్నారు. బ్రిక్స్ దేశాలతో పోల్చితే భారత్‌లోనే అల్ట్రా-హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) అధికంగా ఉన్నారు.  అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ మహిళలు మనదేశంలోనే అధికంగా ఉన్నారు. ఈ వివరాలను అంతర్జాతీయ  వెల్త్ ఇంటెలిజెన్స్, ప్రాస్పెక్టింగ్ కంపెనీ వెల్త్-ఎక్స్ రూపొందించిన నివేదిక వెల్లడించింది.   3 కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు(ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉన్న షేర్లు, రెసిడెన్షియల్, ఇన్వెస్ట్‌మెంట్ ఆస్తులు, ఆర్ట్ కలెక్షన్లు, విమానాలు, నగదు, ఇతర ఆస్తులు కలిపి) పైబడి ఉన్న వారిని అల్ట్రా-హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐగా  పరిగణించి ఈ సంస్థ ఈ ఏడాదికి ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక పేర్కొన్న మరి కొన్ని ముఖ్యాంశాలు.., 
 
   బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా)దేశాల్లో భారత్‌లోనే యూహెచ్‌ఎన్‌ఐడబ్ల్యూలు ఎక్కువగా ఉన్నారు. వీరి సంఖ్య  7,850గా ఉంది.   వీరిలో 90 శాతానికి పైగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూర్, కోల్‌కత, చెన్నై, అహ్మదాబాద్, పుణే, గుర్గావ్, జైపూర్‌ల్లోనే నివసిస్తున్నారు. వీరందరి ఆస్తుల విలువ 93,500 కోట్ల డాలర్లుగా ఉంది.   ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ మహిళలు భారత్‌లోనే అధికం. మన దేశంలో వీరి సంఖ్య 1,250 గా ఉంది. వీరందరి ఆస్తుల విలువ 9,500 కోట్ల డాలర్లు. ఏడాది కాలంలో దేశ జనాభా 1.6% వృద్ధి సాధించగా, 120 మంది కొత్తగా యూహెచ్‌ఎన్‌ఐడబ్ల్యూ హోదా పొందారు. 
 
 బిలియనీర్ల సంఖ్య మాత్రం ఏడాది కాలంలో 109 నుంచి 103కు తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 2,170 మంది బిలియనీర్లు ఉన్నారు.   గత ఏడాది 19,000 కోట్ల డాలర్లుగా ఉన్న భారత బిలియనీర్ల మొత్తం సంపద ఈ ఏడాదిలో 5.3 శాతం క్షీణించి 18,000 కోట్ల డాలర్లకు తగ్గింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హైనెట్‌వర్త్ వ్యక్తుల సంఖ్య 1,99,235కు చేరింది. ఇదే ఇప్పటివరకూ అత్యంత గరిష్టం కావడం గమనార్హం. వీరిలో 1,75,730 మంది పురుషులు కాగా, 23,505 మంది మహిళలు. 
 
మరిన్ని వార్తలు