త్వరలో పెట్రోల్ దిగుమతి అవసరం ఉండదట!

7 Sep, 2016 14:54 IST|Sakshi
త్వరలో పెట్రోల్ దిగుమతి అవసరం ఉండదట!

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం భారత్ కేవలం రూ. 4.5 లక్షల కోట్ల ముడిచమురును మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. గతంలో దాదాపు రూ. 7.54  లక్షల కోట్ల మేర ముడిచమురును దిగుమతి చేసుకుంటే తప్ప మన అవసరాలు తీరేవి కావు. కానీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిపై దేశం దృష్టి పెట్టడంతో ముడిచమురు దిగుమతి గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇక త్వరలోనే ముడిచమురు దిగుమతి చేసుకొనే అవసరం భారత్ కు ఉండబోదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.

'పెట్రోలియం దిగుమతులు అవసరమే లేని దేశంగా భారత్ ను మేం అభివృద్ధి చేయబోతున్నాం. ఎథనాల్, మెథనాల్, బయో సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాడకాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం. దీనివల్ల గ్రామీణ, వ్యవసాయ రంగాలకు ఊతం లభిస్తుంది. పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది' అని కేంద్ర రోడ్డురవాణా శాఖమంత్రి గడ్కరీ బుధవారం తెలిపారు.

మెథనాల్ ఇంధన వనరు వినియోగంపై నీతి ఆయోగ్ సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో భారత్ రూ. 7.5 లక్షల కోట్ల ముడిచమురును దిగుమతి చేసుకునేదని, ఇప్పుడు కేవలం రూ. 4.5 లక్షల ముడిచమురు మాత్రమే దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగాఈ వృద్ధి చెందుతున్న భారత్ కు.. వ్యవసాయం, వెదురు ఉత్పత్తి, మిగులు బొగ్గు గనులను ఉపయోగించుకునే సువర్ణావకాశం లభించిందని తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ రంగాన్ని విభిన్నరీతిలో ఇంధన అవసరాలు తీర్చే దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని చెప్పారు.

మరిన్ని వార్తలు