రూపాయి అర శాతం అప్..

26 Sep, 2013 00:38 IST|Sakshi

ముంబై:  వరుసగా క్షీణించిన రూపాయి మారకం విలువ బుధవారం మళ్లీ పెరిగింది. డాలర్‌తో పోలిస్తే 31 పైసలు బలపడి 62.44 వద్ద ముగిసింది. ఎగుమతిదారులు, బ్యాంకులు.. డాలర్లను విక్రయించడం దీనికి దోహదపడింది. ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 62.75తో పోలిస్తే కాస్త బలహీనంగా 62.76 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో  62.88 స్థాయికి కూడా తగ్గింది. అయితే, బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో మళ్లీ కోలుకుని 62.31కి ఎగిసి చివరికి 0.49 శాతం లాభంతో 62.44 వద్ద ముగిసింది. కార్పొరేట్లు.. ప్రధానంగా ఐటీ ఎగుమతి సంస్థలు డాలర్లను విక్రయించడం కూడా ఇందుకు దోహదపడి ఉండొచ్చని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా చెప్పారు. క్రితం మూడు సెషన్లలో రూపాయి మారకం విలువ 98 పైసల మేర పతనమైంది. రూపాయి ట్రేడింగ్ 62-63 శ్రేణిలో తిరుగాడవచ్చని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.

మరిన్ని వార్తలు