ఐఆర్సీటీసీ నుంచి హెలికాప్టర్ సర్వీసులు!

28 Apr, 2015 19:44 IST|Sakshi
ఐఆర్సీటీసీ నుంచి హెలికాప్టర్ సర్వీసులు!

ఐఆర్సీటీసీ అనగానే కేవలం రైళ్ల టికెట్లు బుక్ చేసుకోడానికే అనుకుంటాం కదూ.. కానీ ఇప్పుడు సరికొత్త సేవల్లోకి కూడా ఈ సంస్థ దిగుతోంది. ముంబై నగరాన్ని హెలికాప్టర్లోంచి చూపించే సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సేవను ప్రారంభించారు. ముంబై నగరాన్ని ఒక్కసారి హెలికాప్టర్లో అలా చుట్టి రావాలంటే.. రూ. 5,580  చార్జీ అవుతుందని ఐఆర్సీటీసీ రీజనల్ డైరెక్టర్ వీరేందర్ సింగ్ తెలిపారు.

జుహు ఏరోడ్రమ్ నుంచి హెలికాప్టర్ ఎక్కి అలా చుట్టు తిరగొచ్చు.  మంగళ, శుక్రవారాల్లో దక్షిణ ముంబై పర్యటన ఉంటుంది. జుహు, బాంద్రా-వర్లి సీలింక్, హజీ అలీ ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. ఉత్తర ముంబై మార్గానికి సోమ, శనివారాల్లో ట్రిప్పులుంటాయి. అందులో జుహు, వెర్సోవా, మలాడ్, గొరాయ, పగోడా, ఎస్సెల్ వరల్డ్ ప్రాంతాలు కవరవుతాయి. హెలికాప్టర్ సముద్రమట్టానికి వెయ్యి అడుగుల ఎత్తున ఎగురుతుంది కాబట్టి ఇదంతా చాలా సరదాగా ఉంటుందని వీరేందర్ సింగ్ చెప్పారు.

మరిన్ని వార్తలు