కూరగాయలకూ కష్టమే..!

9 Aug, 2015 00:23 IST|Sakshi
కూరగాయలకూ కష్టమే..!

రాష్ట్రంలో కరువు ప్రభావం కూరగాయల సాగుపైనా పడింది. తెలంగాణలో ‘వెజిటబుట్ హబ్’గా ఆవిర్భవించిన మెదక్ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి కరువు తీవ్రతను కళ్లకు కడుతోంది. ఈ జిల్లాలో సాధారణంగా దాదాపు 50 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతుంటాయి. కానీ ఈసారి వర్షాభావం కారణంగా కూరగాయల రైతులు కుదేలయ్యారు. దిగుబడులు భారీగా తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం రంగారెడ్డి జిల్లాలోనూ కూరగాయల రైతులను దెబ్బ తీసింది. ఖరీఫ్ సీజన్‌లో ఇక్కడ 25 వేల హెక్టార్లలో కూరగాయలు సాగవుతాయి. సీజన్ ప్రారంభంలో వర్షాలు మురిపించడంతో రైతులు దాదాపు 15 వేల హెక్టార్లలో సాగు మొదలుపెట్టారు. కానీ వర్షాలు ముఖం చాటేయడం, భూగర్భజలాలూ తగ్గిపోవడంతో టమాటా, క్యారెట్, బీట్‌రూట్ పంటలు దెబ్బతిన్నాయి. చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో పంటల ఎదుగుదల నిలిచిపోయింది.

ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా టమాట, మిర్చి పంటలు వేసినా.. మొలక దశలోనే వాడిపోతున్నాయి. ముఖ్యంగా గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, జైనథ్ మండలాల్లో టమాటా ఎండిపోయింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పాలమూరు జిల్లాలోనూ కూరగాయల సాగును వర్షాభావం కోలుకోలేని దెబ్బతీసింది. మరోవైపు కూరగాయల కొరత కారణంగా హైదరాబాద్ నగరంలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నా.. హైదరాబాద్ అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. అసలు ప్రపంచ ఆహార సంస్థ నియమావళి ప్రకారం ఒక్కో వ్యక్తికి రోజుకు 250 గ్రాముల కూరగాయలు వినియోగించాలి. ఈ లెక్కన నగరంలోని జనాభాకు సుమారు 2,500 టన్నులు అవసరమని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అంచనా వే యగా... ప్రస్తుతం రోజుకు 1,600 టన్నులే సరఫరా అవుతున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి.
 
 

మరిన్ని వార్తలు