మెజారిటీతోనే బిల్లుకు ఆమోదం: జైపాల్ రెడ్డి

19 Feb, 2014 02:20 IST|Sakshi
మెజారిటీతోనే బిల్లుకు ఆమోదం: జైపాల్ రెడ్డి

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభలో మూడిం ట రెండొంతుల మెజారిటీతో ఆమో దం లభించిందని కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్నారంటూ ప్రచారం చేయడం సరికాదని, ఓటింగ్ ద్వారానే బిల్లు ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం తర్వాత మంగళవారం జైపాల్‌రెడ్డి నివాసానికొచ్చిన టీ-మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు స్వీట్లు పంచుకుని, బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
 
 
 అనంతరం కేంద్ర మంత్రు లు సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్‌తోపాటు రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల, సారయ్య, ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులతో కలిసి జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘యూపీఏ, బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించాక కూడా బిల్లుకు తగిన సంఖ్యా బలం లేదని ఎవరైనా చెప్పగలరా? తెలంగాణ రావడం సీపీఎంకు ఇష్టం లేదు. అందుకే ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి బిల్లుపై సవరణలు, ఓటింగ్ కోరాలనుకుంటే ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాదిరిగా సభలోని తమ తమ స్థానాల్లో ఎందుకు కూర్చోలేదు? అలాగాక వెల్‌లోకి దూసుకువచ్చి సవరణలపై ఓటింగ్ కోరడమేంటి?’’ అని ప్రశ్నించారు. కాగా తెలంగాణ ఏర్పాటు చారిత్రక విజయమని, దీన్ని ఉద్యమ అమరులకు అంకితమిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీభవన్‌లో టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబరాలు చేసుకున్నారు. తర్వాత విలేకర్లతో మాట్లాడారు.
 
 మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, డీకే అరుణ, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, యాదవరెడ్డి, మల్లురవి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అభివర్ణించారు.
 

మరిన్ని వార్తలు