స్టెంట్ రూపొందించారు.. గుండెపోటుతో మరణించారు!

27 Jul, 2015 21:48 IST|Sakshi

తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే కరొనరీ స్టెంట్ను కనుగొన్న కలాం.. గుండెపోటుతోనే కన్నుమూయడం అత్యంత విషాదకరం. అంతకుముందు వరకు హృద్రోగులకు స్టెంట్ అమర్చాలంటే చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అయ్యేది. అది అందరికీ అందుబాటులో ఉండేది కూడా కాదు. బాగా డబ్బున్నవాళ్లు మాత్రమే అది వేయించుకోగలిగేవారు. దాంతో పేదవాళ్లు స్టంట్ అమర్చుకునే వీలు లేక.. చాలామంది హృద్రోగాలతో ప్రాణాలు కూడా కోల్పోయేవాళ్లు.

ఈ పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన చెందిన అబ్దుల్ కలాం.. 1998లో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ సోమరాజుతో కలిసి అతి తక్కువ ధర కలిగే కరొనరీ స్టెంట్ను రూపొందించారు. దీన్ని కలాం-రాజు స్టంట్ అంటారు. ఇది గుండె శస్త్ర చికిత్సలలో పెద్ద సంచలనంగా మారింది. నిరుపేదలు కూడా అప్పటినుంచి స్టెంట్ అమర్చుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోగలిగారు. అలాగే, 2012 లో ఇద్దరూ కలిసి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం కలాం - రాజు టాబ్లెట్ అనే టాబ్లెట్ పీసీని రూపొందించారు. ఇలా హృద్రోగులను కాపాడేందుకు ఎంతగానో శ్రమించిన అబ్దుల్ కలాం.. చివరకు అదే గుండెపోటుతో మరణించడం పలువురిని తీవ్రంగా కలచివేసింది.

మరిన్ని వార్తలు