Heart Attack Risk: చాలామంది అలానే అనుకుంటారు.. కానీ గుండెపోటు ఎందుకు వస్తుందంటే..

28 Aug, 2023 15:49 IST|Sakshi

ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఎక్కువగా వింటున్నాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే హార్ట్‌ఎటాక్‌కు గురవుతున్నారు.అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.

ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నడిమింటి నవీన్‌ మాటల్లోనే..
 

మన‌ శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. అలాంటి గుండెకు కూడా రక్తం అవసరం అవుతుంది.మరి ఈ గుండె గోడలకు "హృదయ ధమనులు" అనే అతి ముఖ్యమైన రక్త నాళాలు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తాయి. మనం తినే ఆహారంలో అధిక క్రొవ్వు పదార్థాలు ఉన్నట్లైతే ఈ కొవ్వు హృదయ ధమనుల్లో క్రమ క్రమంగా పేరుకు పోయి ఒకానొక దశలో గుండె గోడలకు రక్త సరఫరా పాక్షికంగానో, పూర్తిగానో ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో అదృష్టం కొద్దీ బతికితే వైద్యులు హృదయ ధమనులు గుండా రక్తం సాఫీగా ప్రవహించడానికి అవసరమైతే స్టెంట్ వేయడం లేదా రక్తం పలుచబడే ట్యాబ్లెట్స్‌ వాడమని చెబుతారు. వాల్వ్‌లు బ్లాక్‌ కావడం వల్ల వచ్చే గుండెపోటు చాలా అరుదుగా జరుగుతుంది. చాలామంది గుండెపోటు రావడానికి కారణం వాల్వ్‌లు బ్లాక్‌ కావడమే అనుకుంటారు. కానీ హార్ట్‌ఎటాక్‌ రావడానికి ప్రధాన కారణం కవాటాలు పనిచేయకపోవడం(వాల్వ్‌లు బ్లాక్‌ కావడం)కాదు.

గుండెపోటు రావడానికి కారణం

వృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం
చిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్‌ఫుడ్‌లు వదలలేకపోవడం
కాలానికి తగినట్లుగా పిరియాడికల్‌ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడం
శక్తికి మించి జిమ్‌, ఎక్సర్‌సైజులు వంటివి చేయడం

  • గుండెపోటు రాకుండా ఏం చేయాలి?
  • క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడం
  • ప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక వ్యాయామము చేయడం.
  • ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం
  • ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం

-డా. నవీన్‌ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు

మరిన్ని వార్తలు