కేంద్ర మంత్రిని కలిసిన కేటీఆర్

7 Dec, 2015 18:54 IST|Sakshi

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్ లో కలిశారు. స్థానిక సంస్థలను ఆదుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్.. కేంద్ర మంత్రిని కోరారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా నిధులన్నీ గ్రామ పంచాయితీలకే వెళుతున్నాయని.. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఈ సందర్భంగా కేటీఆర్.. బీరేంద్ర సింగ్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా రాష్ట్రాల పంచాయితీ రాజ్ మంత్రులతో సమావేశం కానున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి స్థానిక సంస్థలకు బడ్జెట్ లో నిధులు కేటాయించేలా ఒత్తిడి తెస్తామని అన్నారు.

దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్... మిగతా రాష్ట్రాలు కూడా ఈ సమస్యను తమ దృష్టికి తీసుకు వచ్చాయని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకం అందరికీ ఆదర్శప్రాయం అని కేంద్ర మంత్రి  కితాబిచ్చారు.

మరిన్ని వార్తలు