ఆస్పత్రిపాలైన ప్రఖ్యాత తెలుగు దర్శకుడు

31 Jan, 2017 13:55 IST|Sakshi
ఆస్పత్రిపాలైన ప్రఖ్యాత తెలుగు దర్శకుడు

హైదరాబాద్‌: ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ కారణంగా ప్రస్తుతం ఆయన కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కిమ్స్‌ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.

మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ కారణంగా దాసరి నారాయణరావు ఆస్పత్రిలో చేరారని, ఆయనకు తగిన చికిత్స అందిస్తున్నామని కిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఆయనకు డయాలసిస్‌ చేశామని, వెంటిలేటర్‌ మీద ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, దీనికి ఆయన స్పందిస్తున్నారని కిమ్స్‌ ఎండీ, సీఈవో బొల్లినేని భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ఫెక్షన్‌ను కంట్రోల్‌ చేయడానికి ఆయనకు ఛాతి ఆపరేషన్‌ చేయబోతున్నామని, ఆపరేషన్‌ తర్వాత దాసరి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తామని తెలిపారు.

దాసరి చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు కూడా చెపుతున్నారు. అనేక సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా లిమ్కా బుక్‌ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు.  తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించారు.

రాజకీయాలలోను దాసరి నారాయణరావు చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుల రిజర్వేషన్‌ ఉద్యమానికి దాసరి మద్దతు పలికారు. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీనంబర్‌ 150' వేడుకకు కూడా దాసరి హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆస్పత్రికి వచ్చిన మోహన్‌బాబు, జయసుధ దంపతులు
దాసరిని పరామర్శించేందుకు నటుడు మోహన్‌బాబు, జయసుధ దంపతులు కిమ్స్‌ ఆస్పత్రికి వచ్చారు. దాసరి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆపరేషన్‌ చేయనున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు.