అమెరికాకు బిలావల్ వార్నింగ్

31 Jan, 2017 11:12 IST|Sakshi
అమెరికాకు బిలావల్ వార్నింగ్

వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాల పౌరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్‌ భుట్టో జర్దారీ తప్పుబట్టారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం దేశాల మధ్య చిచ్చు పెట్టి, యుద్ధాలకు కారణమయ్యేలా ఉందని మండిపడ్డారు. వాషింగ్టన్ పౌరులను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రసంగించారు.

‘ముస్లిం పౌరులను తమ దేశంలోకి రాకుండా అమెరికా తీసుకున్న నిర్ణయంతో దేశాల మధ్య ఘర్షణలకు కారణమయ్యే అవకాశముంది. నిషేధిత జాబితాలో పాకిస్థాన్ ను కూడా చేర్చితే యుద్ధం వచ్చే రావొచ్చ’ని హెచ్చరించారు. ముస్లింలపై నిషేధం ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత వివాదస్పద నిర్ణయమని ధ్వజమెత్తారు.

పాకిస్థాన్ పౌరులపైనా నిషేధం విధిస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా... అలా చేస్తే అమెరికాపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుందని సమాధానమిచ్చారు. కొంత మంది ఉగ్రవాదులు చేసిన చర్యలకు మొత్తం ముస్లింలపై నిషేధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ముస్లిం ప్రపంచానికి ట్రంప్ నిర్ణయం నిరుత్సాహం కలిగించిందని పేర్కొన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముందుండి పోరాడుతున్న వారికి ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశముందన్నారు. అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకుంటుందన్న ఆశాభావాన్ని బిలావల్ వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు