నేడే ఎన్నికల సైరన్

5 Mar, 2014 01:57 IST|Sakshi
నేడే ఎన్నికల సైరన్

* సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ
* దేశవ్యాప్తంగా 6 లేదా 7 విడతల్లో పోలింగ్!
* ఆంధ్రప్రదేశ్‌లో చివరి రెండు దశల్లో ఎన్నికలు?
 
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠతో కొంత కాలంగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లో దేశంలో సాధారణ ఎన్నికల నగారా మోగనుంది. 15వ లోక్‌సభ గడువు మే 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో 16వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్.సంపత్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు కూడా షెడ్యూలు ప్రకటించనున్నారు.

సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ.జైదీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. షెడ్యూలు ప్రకటనతో బుధవారం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి వేదికను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞాన్‌భవన్‌కు మార్చింది. ఎంపిక చేసిన పాత్రికేయులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాలు అందని వారిలో పీఐబీ కార్డులు ఉన్నవారికి ప్రవేశం కల్పించనుంది.

ఆరు లేదా ఏడు విడతల్లో ఎన్నికలు..!
* ఏప్రిల్ రెండో వారంలో మొదలుపెట్టి మే 15వ తేదీకల్లా మొత్తం ఎన్నికల పర్వాన్ని పూర్తిచేసేందుకు ఈసీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికలను మొత్తం ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించనున్నట్లు సమాచారం.

*  2004లో నాలుగు విడతలుగా, 2009లో ఐదు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. ఈసారి అంతకంటే ఎక్కువగా ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి.

*  ఈ ఎన్నికల్లో దాదాపు 81.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకూ కొత్తగా 9.71 కోట్ల మంది ఓటర్ల జాబితాలో చేరారు.

*  ఈ అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ.. బుధవారం మొదలుకుని 75 రోజుల పాటు కొనసాగనుంది. ఏప్రిల్ రెండో వారాంతం నుంచి మే 15వ తేదీకి అటూఇటుగా పోలింగ్ ముగియనుంది.

* భద్రతా బలగాలను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకే ఎక్కువ విడతలుగా ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.

* నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో మొదటి మూడు విడతల్లో పోలింగ్ ప్రక్రియను ముగించనున్నారు.
*  విద్యార్థులకు వేసవి సెలవులు, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మిగిలిన మూడు విడతల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.
 
రాష్ట్రంలో ఎన్నికలపై ఉత్కంఠ
సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సరిగ్గా సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల వేళ మున్సిపల్ ఎన్నికలకు కూడా షెడ్యూలు విడుదల కావటంతో.. రాష్ట్రంలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు చివరి విడతల్లో జరుగుతాయన్న ప్రచారం తెరపైకి వచ్చింది. నిజానికి 2004, 2009లో రాష్ట్రంలో తొలి రెండు విడతల్లోనే పోలింగ్ పూర్తయింది. అవి ఏప్రిల్ మూడు, నాలుగు వారాల్లో జరిగాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పర్వం ఏప్రిల్ 7వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఈసారి కూడా తొలి రెండు విడతల్లో నిర్వహిస్తారా? లేక చివరి విడతల్లో నిర్వహిస్తారా? అన్న విషయం బుధవారం స్పష్టంకానుంది.

మరిన్ని వార్తలు