అబద్ధపు గర్భం.. ఆరునెలల జీతం

2 Nov, 2015 12:22 IST|Sakshi
అబద్ధపు గర్భం.. ఆరునెలల జీతం

సాక్షి, హైదరాబాద్: ‘‘సార్ డాక్టర్ గారూ.. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. నేను విదేశాలకు వెళ్లాలి. కనీసం ఆరు నెలల సెలవు కావాలి. మీరు సహాయం చేయాలి’’ అని ప్రభుత్వ ఉద్యోగిని అడగ్గానే ‘‘ సరేనమ్మా, నీకు ప్రసూతి సెలవు వచ్చేలా పత్రాలు సృష్టిస్తాను. నాకు ఒక నెల జీతం ఇవ్వాలి’’ అని డాక్టర్లు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇలా కొంతమంది డాక్టర్లు, ఉద్యోగినులు కలసి ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. గర్భిణులైన ఉద్యోగినులకు ప్రభుత్వం జీతంతో కూడిన ఆరు నెలల సెలవు మంజూరు చేస్తుంది.

ఈ నిబంధనను ఆసరాగా తీసుకుని కొంతమంది ఉద్యోగినులు.. తాము గర్భిణులమంటూ డాక్టర్ల సాయంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఆరు నెలలు సెలవులు ఎంజాయ్ చేయడంతో పాటు జీతాన్ని కూడా తీసుకుంటున్నారు. ఆ తర్వాత తమ గర్భం పోయిందనో, లేక బిడ్డ చనిపోయాడనో తప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలా సెలవులు తీసుకున్నా వారు వందలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) కూడా తీసుకోకుండా విదేశాలకూ వెళ్లిరావడం ఆశ్చర్యపరుస్తోంది.
 
శ్రీకాకుళం ఘటనపై విచారణ..
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు గర్భిణి కాకుండానే మెటర్నిటీ సెలవుకు దరఖాస్తు చేసుకుని సెలవు తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. తనకు బిడ్డ పుట్టాడని,  పుట్టిన తొమ్మిది రోజులకు చనిపోయాడని విచారణలో ఆ ఉద్యోగిని చెప్పింది. దీనిని శ్రీకాకుళం రిమ్స్‌కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యుడు  ధ్రువీకరించారు. అయితే కలెక్టర్ విచారణలో ఆమెకు గర్భం అబద్ధమని, వైద్యుడు ఇచ్చిన నివేదిక కూడా తప్పు అని తేలింది.

అంతేగాకుండా వైద్యుడిపైనా ఫిర్యాదులురావడంతో అతనిపైనా విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. తీగలాగితే డొంకంతా కదిలింది. ఆ వైద్యుడికి ఆ ఉద్యోగిని భారీగా ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇలాంటి కేసులు ఇంకా ఎన్నున్నాయో ఆరా తీయాలని కలెక్టర్ ఆదేశించారు. దీన్నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు ఆ వైద్యుడు నానా తంటాలు పడుతున్నారు. కేసునుంచి బయటపడేందుకు ఒక మంత్రి పేషీని ఆశ్రయించినట్టు తెలుస్తోంది.
 
డబ్బులిస్తే.. ధ్రువపత్రాలు
వైద్యులను ఆశ్రయిస్తే చాలు గర్భిణి కాకపోయినా సరే ధ్రువపత్రాలు సృష్టిస్తారు. నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు, మందులు వాడినట్టు కూడా రికార్డులు సృష్టిస్తారు. అయితే దీనికోసం ఉద్యోగినులు ఒక నెల వేతనం ఇవ్వాలి.  ప్రసవం డేటు, బిడ్డ పుట్టిన వివరాలు అన్నీ అలా సృష్టించేస్తారు. ఆ పత్రాలన్నీ ప్రభుత్వానికి సమర్పిస్తే చాలు, ఆరునెలల సెలవులు ఎంజాయ్ చేస్తూ జీతం తీసుకోవచ్చు. ఒక నెల జీతమే కదా పోతే పోనీ అని చాలామంది వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు బయటికి వస్తున్నా రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి నకిలీ కేసులపై చర్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా నాలుగైదు వందల మంది ఇలాంటి సెలవులు తీసుకుంటున్నట్లు అంచనా.
 

మరిన్ని వార్తలు