రాష్ట్రపతి పదవా.. నాకొద్దు!

29 Mar, 2017 14:00 IST|Sakshi
రాష్ట్రపతి పదవా.. నాకొద్దు!

రాష్ట్రపతి ఎన్నికల రేసులో తాను లేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఈ విషయమై మొదలైన ఊహాగానాలకు ఆయన తెరదించారు. మోహన్ భాగవత్‌ను రాష్ట్రపతి చేయాలని, తద్వారా హిందూరాజ్యానికి బాటలు పరవాలని శివసేన చెబుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇది ఎప్పటికీ జరిగేది కాదని, తాను ఆర్ఎస్ఎస్ కోసం మాత్రమే పనిచేస్తానని భాగవత్ తెలిపారు. ఆర్ఎస్ఎస్‌లో చేరేముందే తాను అన్ని తలుపులు మూసేశానని, ఈ విషయంలో వస్తున్నవన్నీ వదంతులు మాత్రమేనని ఆయన అన్నారు. పొరపాటున ఎవరైనా తన పేరు ప్రతిపాదించినా తాను ఎప్పటికీ ఒప్పుకోబోనని కుండ బద్దలుకొట్టారు.  

భాగవత్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే తాము మద్దతిస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంతకుముందు అన్నారు. ఇటీవలి కాలంలో బీజేపీ - శివసేన మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అయితే ఎవరికీ తగినంత బలం లేకపోవడంతో చివరకు శివసేనకు బీజేపీ మద్దతిచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు కావల్సిన ఎలక్టొరల్ కాలేజి బలం చాలావరకు ఎన్డీయేకు వచ్చేసింది. అంతకుముందు వరకు కొంత అనుమానంగా ఉన్నా.. ఆ తర్వాత మాత్రం కమలనాథులు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎల్‌కే అద్వానీ లాంటి నాయకులను రాష్ట్రపతిగా చేసేటట్లయితే తాము సైతం మద్దతిస్తామని మమతా బెనర్జీ లాంటివాళ్లు సైతం అంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం కూడా వేడెక్కింది.

మరిన్ని వార్తలు