ఇన్ఫోసిస్ అల్లుడు.. ఎంపీ అయ్యాడు!

8 May, 2015 18:16 IST|Sakshi
ఇన్ఫోసిస్ అల్లుడు.. ఎంపీ అయ్యాడు!

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అల్లుడు రిషి శునక్ బ్రిటన్లో అధికార పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు. దీనిపై నారాయణమూర్తి తన సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన రిషి.. 51 శాతం ఓట్లు సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి యూకే ఇండిపెండెన్స్ పార్టీ అభ్యర్థి మాథ్యూ కూక్ మాత్రం కేవలం 15 శాతం ఓట్లే గెలుచుకున్నారు. లేబర్ పార్టీకి చెందిన మైక్ హిల్కు 13 శాతం ఓట్లు వచ్చాయి.  దాంతో రిషి భారీ మెజారిటీతో నెగ్గినట్లయింది. రిచ్మండ్-యార్క్స్ నియోజకవర్గంలో ఆయన విజయం పట్ల నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. శునక్ (34), అతడి భార్య అక్షత (35) ఎన్నికల ప్రచార సమయంలో బాగా కష్టపడ్డారని, వాళ్ల కష్టానికి తగిన ఫలితం లభించిందని నారాయణమూర్తి చెప్పారు. ఎంపీగా కూడా ఆయన బాగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

కన్సర్వేటివ్ పార్టీ తరఫున మొత్తం 10 మంది భారత సంతతి ప్రతినిధులు ఎంపీలుగా ఎన్నిక కాగా.. వాళ్లందరిలో తొలిసారి ఎన్నికైన ఏకైక వ్యక్తి రిషి. మిగిలిన తొమ్మిది మందిలో పాల్ ఉప్పల్ తప్ప మిగిలిన అందరూ ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరూ మాత్రం ఓడిపోయారు. రిషి శునక్, అక్షతలు 2009 ఆగస్టు 30వ తేదీన పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చదివారు.

మరిన్ని వార్తలు