సైన్యం దాడి: మిడ్సెషన్లో మార్కెట్ల భారీ పతనం

29 Sep, 2016 14:37 IST|Sakshi
సైన్యం దాడి: మిడ్సెషన్లో మార్కెట్ల భారీ పతనం
పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసిందంటూ భారత సైన్యం ప్రతినిధి చెప్పిన కొద్ది సేపటికే.. మిడ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. డీజీఎమ్ఓ వ్యాఖ్యల అనంతరం దేశీయ సూచీలు గురువారం మధ్యాహ్నం సెషన్లో భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 573 పాయింట్లు పడిపోయి,28వేల దిగువకు 27,719 వద్దకు వచ్చి చేరింది. రియాల్టీ, హెల్త్ కేర్, పవర్, మెటల్ వంటి అన్ని రంగాల షేర్లు దాదాపు 5.05 శాతం పతనమయ్యాయి.అదేవిధంగా  నిఫ్టీ సైతం 186.90 పాయింట్ల నష్టపోయి, 86వేల దిగువకు 8,558.25గా నమోదైంది.ఈ భారీ పతనానికి ప్రధాన కారణం పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిందేననే డీజీఎమ్ఓ కామెంట్లేనని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.
 
నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల లాంచ్‌పాడ్లపై భారత సైన్యం గత రాత్రి సునిశిత దాడులు చేసిందనే వార్తను డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎమ్ఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ వెల్లడించారు. పాక్ భూభాగంలో ఉన్న 8 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్టు తెలిపారు. దీంతో దేశీయ మార్కెట్ల సెంటిమెంట్కు తీవ్రంగా దెబ్బతీసింది. ఒక్కసారిగా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, లుపిన్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, గెయిల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, లార్సెన్ అండ్ టుబ్రో, ఆసియన్ పేయింట్స్ నష్టాల బాట పట్టాయి.ఈ షేర్లు దాదాపు 4.75 శాతం మేర పతనమయ్యాయి. 
 
ఉడీ ఉగ్రఘటనతో భారత్కు, పాకిస్తాన్కు తీవ్ర చిచ్చు రేగింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత్ హెచ్చరించింది. డీజీఎమ్ఓ ప్రకటన భారత ఫైనాన్సియల్ మార్కెట్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. అంతర్జాతీయ పాజిటివ్ సంకేతాలతో మార్నింగ్ సెషన్లో 150 పాయింట్లకు పైగా ఎగిసి 28,423.14 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.అనంతరం 28,475.57 గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్న సెషన్ వచ్చే సరికి డీజీఎంఓ ప్రకటన వెలువడటంతో సెన్సెక్స్ 573 పాయింట్ల భారీ పతనాన్ని మూటకట్టుకుని 27,719.92 పాయింట్ల దిగువకు పడిపోయింది.

 

మరిన్ని వార్తలు