తప్పక తప్పుకున్నారు!

23 Oct, 2014 12:58 IST|Sakshi
తప్పక తప్పుకున్నారు!

మహారాష్ట్ర బీజేపీలో తలెత్తిన గందరగోళం సద్దుమణిగింది. సీఎం సీటుపై నితిన్ గడ్కరీ కన్నేయడంతో కాషాయపార్టీలో కలకలం రేగింది. తన మద్దతుదారులతో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు గడ్కరీ వేసిన ఎత్తులు పారలేదు. నాగపూర్ కేంద్రంగా సాగించిన క్యాంపు రాజకీయాలు ఫలించకపోవడంతో గడ్కరీ వెనక్కు తగ్గారు. సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సందిగ్దతకు తెర దించారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిండచంతో సీఎం పదవిపై గడ్కరీ ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించకుండా తన మద్దతుదారులతో చెప్పించారు. సుధీర్ మునిగంటివార్, వినోద్ తావ్డే, కృష్ణ కోపడే వంటి నాయకులు గడ్కరీ పేరును సీఎం పదవికి పరిశీలించాలని బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అలాగే విదర్భ నుంచి ఎన్నికైన 44 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సైతం నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు.

అయితే అధిష్టానం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వైపే మొగ్గుచూపడంతో గడ్కరీ తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైకమాండ్ మనసు మారే పరిస్థితి లేకపోవడంతో సీఎం రేసు నుంచి గడ్కరీ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇక ఢిల్లీకే పరిమితమవుతానని ప్రకటించారు. గడ్కరీ తప్పుకోవడంతో ఫడ్నవిస్ కు లైన్ క్లియరైంది.

మరిన్ని వార్తలు