'మహా' విజయం

8 Nov, 2015 19:59 IST|Sakshi
'మహా' విజయం

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ల మహా లౌకిక కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన పోరులో మహా కూటమి 178  సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని విజయాన్ని సాధించగా, ఎన్డీఏ కూటమి 58 సీట్లను దక్కించుకుంది. ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా రంగంలోకి దిగి ప్రచార బాధ్యతలు చేపట్టిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘోరంగా విఫలమైంది.


బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి భారీ విజయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోయారు. చివరకు ఆ పార్టీ నేతలే గెలుపుపై ధీమాగా ఉన్నా అతి పెద్ద విజయాన్ని మాత్రం ఊహించలేదు. బిహార్ ఎన్నికల అనంతరం నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ తేలిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు బిహార్లో పాగా వేసి విజయం కోసం పావులు కదిపినా ఎటువంటి ప్రభావం కనిపించలేదు. నితీష్ అభివృద్ధి మంత్రానికే ప్రజలు పెద్దపీట వేసి మహా కూటమని గెలిపించారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించారు. హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ , ఆర్జేడీ నేత, లాలూ కుమారులు, తేజస్వివి, తేజ్ ప్రతాప్ యాదవ్, జేడీయూ నేతలు విజయ్ కుమార్ యాదవ్, శ్యామ్ రాజక్ లు గెలుపుబావుటా ఎగురవేశారు. మొత్తంగా ఐదు దశల్లో జరిగిన బిహార్ ఎన్నికల్లో అత్యధికంగా 56.8% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో మొత్తం 3450 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

 

ఎన్నికల ఫలితాలు..

జేడీ(యూ) -178

ఎన్డీఏ కూటమి- 58

ఇతరులు-7

 

మరిన్ని వార్తలు