ఓలా.. ఉబర్ డ్రైవర్ల నిరవధిక దీక్ష

2 Mar, 2017 11:46 IST|Sakshi
ఓలా.. ఉబర్ డ్రైవర్ల నిరవధిక దీక్ష
క్యాబ్‌ల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ఒకప్పుడు నెలకు 85 వేల రూపాయల వరకు సంపాదించిన క్యాబ్ ఓనర్లు.. ఇప్పుడు 15 వేలు జేబులో వేసుకోవడం కూడా కనాకష్టంగా మారింది. కారు ఈఎంఐ కట్టడానికి కూడా ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఎలా తినాలి, ఎలా బతకాలని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు నిరవధిక సమ్మె ప్రారంభించారు. తాజాగా తమ డిమాండ్ల సాధన కోసం 20 మంది డ్రైవర్లు నిరవధిక దీక్షలు కూడా మొదలుపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కూడా వాళ్ల దీక్షకు మద్దతు పలకడంతో.. ఉద్యమం మరింత వేడెక్కింది. ఇతర రవాణా కార్మిక సంఘాలు కూడా వారికి తోడయ్యాయి. 
 
కంపెనీల తీరును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి కర్ణాటకలో ఓలా, ఉబర్ డ్రైవర్లు నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టారు. క్యాబ్ కంపెనీలకు తగిన నిబంధనలు విధించాలని రవాణాశాఖను కూడా వాళ్లు డిమాండ్ చేశారు. మాజీ సీఎం కుమారస్వామిని కలిసిన తర్వాత వాళ్లు ఫ్రీడం పార్కులో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు కొడిహళ్లి చంద్రశేఖర్ కూడా వాళ్ల కార్యక్రమానికి హాజరై.. అక్కడున్నవారిని ఉద్దేశించి మాట్లాడారు. కంపెనీల విషయంలో కలగజేసుకోవాలని సీఎం సిద్దరామయ్యను, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డిని కోరారు. 
 
క్యాబ్ డ్రైవర్ల డిమాండ్లివీ.. 
  • కొత్త క్యాబ్‌లను ఎటాచ్ చేసుకోవడాన్ని ఓలా, ఉబర్ తక్షణం ఆపాలి. దానివల్ల ఇప్పటికే తక్కువగా ఉన్న బుకింగ్‌లు మరింత తగ్గిపోతున్నాయి. 
  • డ్రైవర్లకు తగిన ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి. నెలకు రూ. 85వేల నుంచి రూ. 15వేలకు ఆదాయం పడిపోయింది. 
  • కస్టమర్ రేటింగుల ఆధారంగా డ్రైవర్లకు జరిమానాలు విధించడాన్ని కంపెనీలు తక్షణం ఆపాలి.
మరిన్ని వార్తలు