ఓఎన్‌జీసీ లాభం 34% డౌన్

13 Aug, 2013 05:03 IST|Sakshi
ఓఎన్‌జీసీ లాభం 34% డౌన్
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఓన్‌జీసీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు రూ. 4,016 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఏప్రిల్-జూన్‌లో ఆర్జించిన రూ. 6,078 కోట్లతో పోలిస్తే ఇది 34% క్షీణత. ఇందుకు సబ్సిడీల చెల్లింపు బిల్లు పెరగడం కారణమైనట్లు కంపెనీ ఫైనాన్స్ డెరైక్టర్ ఏకే బెనర్జీ పేర్కొన్నారు. కాగా, వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ  లాభాలు తగ్గడం గమనార్హం. ఈ కాలంలో సబ్సిడీలకు 2% అధికంగా రూ. 12,622 కోట్లను కేటాయించింది. 
 
 ఇంతక్రితం ఈ పద్దుకింద రూ. 12,346 కోట్లను చెల్లించింది. సబ్సిడీల చెల్లింపులు నికర లాభాలపై రూ. 7,131 కోట్లమేర ప్రతికూల ప్రభావాన్ని చూపాయని బెనర్జీ తెలిపారు. లేదంటే ఈ నిధులను విదేశాలలో ఆస్తుల కొనుగోళ్లకు, మరిన్ని ఇంధన అన్వేషణ కార్యక్రమాలకు వినియోగించేవాళ్లమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సబ్సిడీ చెల్లింపుల కారణంగా నగదు నిల్వలు తరిగిపోయే అవకాశమున్నదని చెప్పారు. ఈ బాటలో మార్చి చివరికల్లా 16% తగ్గిన నగదు నిల్వలు రూ. 13,200 కోట్లకు పరిమితమైనట్లు వెల్లడించారు. వీటితోపాటు ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించిన వన్‌టైమ్ చార్జీలు కూడా లాభాలను ప్రభావితం చేశాయని తెలిపారు.
 
 ఆదాయంలోనూ క్షీణతే
 ప్రస్తుత సమీక్షా కాలానికి ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 19,309 కోట్లకు పరిమితమైంది. గత ఏప్రిల్-జూన్‌లో రూ. 20,178 కోట్లు నమోదైంది.చమురు ధరలు తగ్గడంతో ఆదాయాల్లోనూ కోతపడిందని బెనర్జీ చెప్పారు. ఈ కాలంలో ఉత్పత్తి మాత్రం 6.007 మిలియన్ టన్నుల నుంచి 6.025 మిలియన్ టన్నులకు పెరిగిన ట్లు తెలిపారు.స్థూల ంగా బ్యారల్ చమురును 102.90 డాలర్ల ధరలో విక్రయించినప్పటికీ డిస్కౌంట్లు, సబ్సిడీ చెల్లింపుల వంటివిపోగా నికరంగా 40.17 డాలర్లు లభించినట్లు వెల్లడించారు. గతంలో బ్యారల్‌కు 45.91 డాలర్ల చొప్పున ఆర్జించింది. 
 
>
మరిన్ని వార్తలు