నేటి నుంచి ఆర్టీసీ సమ్మె | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆర్టీసీ సమ్మె

Published Tue, Aug 13 2013 4:57 AM

Today RTC Strike

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట), న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమంలో భాగంగా ఏపీ ఎన్ జీవోల పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సోమవారం అర్ధ రాత్రి నుండి సమ్మెలో పాల్గొననుండడంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరింత నష్టాల్లో కూరుకుపోనుంది. ఒక్క పశ్చిమ రీజియన్ పరిధిలోనే గత ఏప్రిల్ నుంచి జూలై మాసాంతానికి సంస్థ రూ. 4.58 కోట్ల నష్టాన్ని చవిచూసింది. జూలై 31 నుండి ప్రారంభమైన సమైక్య ఉద్యమ నేపధ్యంలో జిల్లాలోని వివిధ డిపోల నుండి పాక్షికంగా సర్వీసులు తిప్పినప్పటికీ 13 రోజుల్లో సుమారు రూ. 3 కోట్ల నష్టం వచ్చింది. సోమవారం రాత్రి నుండి ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కారణంగా రీజియన్ పరిధిలో రోజుకి సుమారు రూ. 45 లక్షలు నష్టం వాటిల్లే ప్రమాద ముందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 
 
పశ్చిమ రీజియన్ పరిధిలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు, భీమవరం డిపోల పరిధిలో ప్రతి నిత్యం 640 సర్వీసులు నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో అన్ని సర్వీసులు కలిపి సుమారు 45 లక్షల కిలోమీటర్లు తిరిగి రూ.45 లక్షల ఆదాయం తీసుకువస్తున్నాయి.   రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలూ ఆర్టీసీకి లాభాలనార్జించి పెడుతుండగా, భౌగోళికాంశాల్లో సీమాంధ్ర ప్రాంతాల్లో 13 జిల్లాలు నష్టాలను చవిచూస్తున్నాయి. మొత్తంగా సంస్థ ఒక్కటిగా ఉన్నప్పుడు లాభనష్టాలను ఒక్కటి చేసి చూడడంతో నష్టాలు పెద్దగా లెక్కలో కనిపించేవి కావు. 
 
లాభాలు వచ్చే ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా, నష్టాలు వచ్చే ప్రాంతాన్ని మరో రాష్ట్రంగా విడగొడితే సీమాంధ్ర ప్రాంత ఆర్టీసీ కనుమరుగైపోయే ప్రమాదముందని ఆయా సంఘాల నాయకులు వివరిస్తున్నారు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతంలో ప్రైవేటు వాహనాల వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టాలు వస్తుండగా సమ్మె ప్రభావంతో ప్రైవేటు యాజమాన్యాలు ప్రజా రవాణాను పూర్తిగా తమ హస్తాల్లోకి తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకూ సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement