గోరఖ్‌పూర్‌ ఘోరకలి: ఆక్సిజన్‌ సప్లయర్‌పై దాడి

12 Aug, 2017 14:57 IST|Sakshi
గోరఖ్‌పూర్‌ ఘోరకలి: ఆక్సిజన్‌ సప్లయర్‌పై దాడి

- 63 మంది చిన్నారుల మరణాలపై యూపీ సీఎం సీరియస్‌
- బీఆర్డీ ఆస్పత్రికి పయనమైన ఇద్దరు మంత్రులు..
- ఆదిత్యనాథ్‌పై విపక్షాల మండిపాటు.. రాజీనామాకు డిమాండ్‌


లక్నో:
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బీఆర్డీ ఆస్పత్రిలో 63 మంది చిన్నారులు మృత్యువాతపడిన ఘటనలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. శనివారం మధ్యాహ్నం లక్నోలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన అత్యున్నత సమావేశం జరిగింది. భేటీ ముగిసిన కొద్ది సేపటికే.. బీఆర్డీ ఆస్పత్రికి ఆక్సిజన్‌ సరఫరాదారుగా ఉన్న ప్రైవేటు సంస్థ కార్యాలయంపై పోలీసులు, వైద్యాధికారులు సంయుక్తంగా దాడి చేశారు. అక్కడి నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, ప్రభుత్వం తమకు రూ.70 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంన్నదునే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం వల్లే సరఫరా నిలిపివేశామని సదరు ప్రైవేటు సంస్థ వాదిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా శుక్రవారం సాయంత్రానికి 300 ఆక్సిజన్‌ సిలెండర్లను ఫైజాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌ బీఆర్డీ ఆస్పత్రికి పంపించామని ఆ సంస్థ పేర్కొంది. సరఫరా దారులపై చర్యలు తీసుకునేది, లేనిదీ ఇంకా స్పష్టత రాలేదు.

సీఎం వెళ్లిపోయిన కొద్దిసేపటికే 23 మంది మృతి
గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో ఆగస్టు 7, 8 తేదీల్లో 21 మంది పిల్లలు చనిపోయారు. గురువారం(ఆగస్ట్‌ 9న) ఉదయం సీఎం ఆదిత్యనాథ్‌ బీఆర్డీ ఆస్పత్రికి వెళ్లి,  చిన్నారుల మరణాలపై వైద్యులతో మాట్లాడి, మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ సరిగ్గా ఆయన వెళ్లిపోయిన కొద్ది సేపటికే ఒక్కొక్కరుగా చిన్నారులు చనిపోయారు. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 23 మంది చనిపోయారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత ఉందన్న విషయాన్ని అధికారులుగానీ, వైద్యులుగానీ సీఎం దృష్టికి తీసుకురాకపోవడం గమనార్హం. అయితే ఆస్పత్రిలో స్టోర్‌ను నిర్వహిస్తోన్న ఉద్యోగులు.. ఆక్సిజన్‌ కొరతపై సీఎం ఆదిత్యనాథ్‌కు గురువారం ఉదయమే ఓ లేఖరాసినట్లు వెల్లడి కావడం మరో సంచలనం. ఆగస్టు 7 నుంచి 12 (ఉదయం 11 గంటల) వరకు బీఆర్డీ ఆస్పత్రిలో మొత్తం 63 మంది చిన్నారులు చనిపోయారు. వీరిలో నవజాత శిశువులు కూడా ఉన్నారు.

స్వచ్ఛందంగా సిలిండర్ల సరఫరా
బీఆర్డీ ఆస్పత్రిలో 63 మంది చిన్నారులు చనిపోయిన ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని యూపీ ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. సీఎం ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. మరోవైపు, పలువురు ఆక్సిజన్‌ సరఫరాదారులు బీఆర్డీ ఆస్పత్రికి స్వచ్ఛందంగా సిలిండర్లను పంపుతున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి పరిస్థితిలో మార్పు కనిపించింది.
(చదవండి: గోరఖ్‌పూర్‌ ఘోరకలి: 63కు పెరిగిన మరణాలు)
(మందులు తెచ్చేలోపే.. ప్రాణాలు విడిచాడు!)

 

 

మరిన్ని వార్తలు