పెంపుడు కుక్కల దాడిలో యజమాని హతం

13 Jul, 2016 14:45 IST|Sakshi
పెంపుడు కుక్కల దాడిలో యజమాని హతం

వేలూరు: పెంపుడు కుక్కల పాశవికదాడిలో యజమాని ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగంలో అసిస్టెంట్ గా పనిచేస్తోన్న కృపాకరం అనే వ్యక్తి.. రాట్ వీలర్ జాతికి చెందిన ఆడ కుక్కను పెంచుకుంటున్నాడు. వేలూరుకు సమీపంలోని తన మామిడి తోటలో కుక్కను కాపాలగా ఉంచి, రోజూ వస్తూ పోతూఉండేవాడు. దాదాపు 50 కేజీల బరువు, అరమీటరు ఎత్తుండే ఆ కుక్కను క్రాసింగ్ చేసే నిమిత్తం.. ఇటీవల అదే జాతికి చెందిన ఓ మగకుక్కను తీసుకొచ్చాడు. రెండు కుక్కలకు తానే స్వయంగా ఆహారం పెట్టేవాడు.

మంగళవారం డ్యూటి నుంచి ఆలస్యంగా వచ్చిన కృపాకరం రాత్రి 10 గంటల సమయంలో మామిడితోటకు వెళ్లి కుక్కలకు ఆహారం పెట్టే ప్రయత్నం చేశాడు. ఏరకమైన చిరాకులో ఉన్నాయోగానీ.. రెండు రాట్ వీలర్ కుక్కలు ఒక్కసారే యజమాని మీద దాడిచేశాయి. ముఖం, ఎద, పొట్ట భాగాన్ని ఖండఖండాలుగా పీకిపారేశాయి. కృపాకరం హాహాకారాలు చేయడంతో తోట పరిసర ప్రాంతాల్లోని రైతులు పరుగుపరుగున వచ్చి.. కుక్కలను అదిలించి, రక్తపు మడుగులో పడిఉన్న అతనిని ఆసుపత్రికి తరలించారు.

తీవ్రరక్తస్రావం కావడం కృపాకరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మాయదారి కుక్కలు ఎంతపని చేశాయంటూ మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న బానవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర పళ్లు, బలమైన దవడలు కలిగిన రాట్ వీలర్ (జర్మన్) జాతి కుక్కల పెంపకంలో అసమాన శ్రద్ధ అవసరమని, ఆదేశాలు పాటించడం నేర్పకపోతే అవి యజమానిపైనే దాడికి దిగుతాయని వేలూరు వణ్యప్రాణి సంరక్షణ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు