-

మోదీ సాహసం ఫలిస్తుందా!

13 Aug, 2016 10:51 IST|Sakshi
మోదీ సాహసం ఫలిస్తుందా!

(సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం)
70 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. అదే వయసున్న కశ్మీర్ సమస్యపై ఏ ప్రభుత్వమూ, ఏ ప్రధానీ చేయలేని సాహసోపేత ప్రకటనను నరేంద్ర మోదీ చేశారు. '56 అంగుళాల ఛాతీ' ఉండాలని పదేపదే చెప్పుకొనే మోదీ.. అధికారం చేపట్టిన ఇన్నాళ్లకు ఆ మాటను నిరూపించారు. మొట్టమొదటిసారి వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)కి అవతలి భూభాగం గురించి మాట్లాడారాయన. ఆయన మంత్రివర్గ సభ్యులు పలు సందర్భాల్లో పాకిస్థాన్ దమనకాండను, దుష్టరాజకీయాలను విమర్శించినా, దాయాది పాలకులతో స్నేహాన్ని మాత్రమే ప్రదర్శించిన మోదీ.. తొలిసారి హెచ్చుస్వరం వినిపించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశానిదేనని కుండ బద్దలుకొట్టి చెప్పడం.. అదీ ఒక ప్రధాని స్థాయిలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటివరకు తీసుకున్న అతిపెద్ద నిర్ణయమని చెప్పక తప్పదు. అందుకే.. శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్థాన్ లపై ఆయన ప్రకటించిన నూతన(అగ్రెసివ్) విధానాన్ని అన్ని పార్టీలూ సమర్థిస్తున్నట్లు చెప్పలేదు. అలాగని విమర్శలూ చేయకపోవడం గమనార్హం. కశ్మీర్ లో నెలకొన్న క్లిష్టపరిస్థితులను తొలిగించే క్రమంలో ఆయా పార్టీలు మోదీని మౌనంగా సమర్థిస్తున్నట్లు మనం భావించాలి. నిజానికి ఇది అవసరం కూడా.

హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్లో చెలరేగిన ఆందోళనల్లో ఇప్పటివరకు దాదాపు 60 మంది పౌరులు చనిపోయారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా లోయలోని 10 జిల్లాల్లో 35 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. తాజాగా అల్లర్లు జమ్ముకు కూడా వ్యాపించాయి. బుర్హాన్ స్థానిక (త్రాల్ పట్టణాకి చెందిన) యువకుడే కావచ్చు. కానీ అతని కమాండర్ ఇన్ చీఫ్ సయీద్ సలాహుద్దీన్ ఇప్పుడు పాకిస్థానీ. (గతంలో కశ్మీర్ లో అక్రమంగా ఎమ్మెల్యే అయి, తర్వాత దేశం విడిచి పారిపోయిన సలాహుద్దీన్ పాక్ పావుగా మారాడు.) చాలాకాలం తర్వాత ఓ స్థానికుడైన ఉగ్రవాది హతం కావడంతో అతని బంధువులు కొంత ఆగ్రహానికి గురైనమాట వాస్తవం అయి ఉండొచ్చు. కానీ వారంతా మూకుమ్మడిగా హురియత్ కు మద్దతు పలికినట్లు కానేకాదు. సరిగ్గా ఇదే సమయంలో పాక్ ప్రభుత్వ ప్రేరిత ఉగ్రసంస్థలు కీలకంగా వ్యవహరించాయి. హఫీజ్ కు చెందిన జమాత్ ఉల్ దవా, సలాహుద్దీన్ కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కశ్మీర్ లోయలోకి చొరబడి, భారత్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. అలాంటి విదేశీ శక్తులను స్వయంగా కశ్మీరీలే పోలీసులకు పట్టించారు. వేళ్లపై లెక్కించగలిగినవారే తప్ప కశ్మీరీలంతా సొంతగడ్డపై ఉండేందుకే కంకణం కట్టుకున్నారన్న సంగతి చాలాసార్లు నిరూపితమైంది. ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలను కూడా సైన్యం అణిచివేతకు వ్యతిరేకంగానే తప్ప.. దేశానికి వ్యతిరేకంగా కాదన్న సంగతి గుర్తించాలి.

ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ భరోసా కశ్మీరీలను తప్పక ఆకట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మన కశ్మీరీలకు.. కంచెకు అవతల (పీఓకేలో) ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసు. పేరుకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినప్పటికీ పీఓకే (దీనేనే పాక్ 'ఆజాద్ కశ్మీర్' గా వ్యవహరిస్తుంది)లో పాకిస్థాన్ ప్రభుత్వ ఆగడాలకు అంతే లేదు. అందుకు చిన్న ఉదాహరణ గత నెలలో 'ఆజాద్ జమ్ము కశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ' ఫలితాలు. భారత్ కు వ్యతిరేకంగా పీఓకేలో తన పార్టీ బలాన్ని పెంచుకునేందుకు నవాజ్ షరీఫ్.. ఏ దేశాధినేతా చేయ(కూడ)ని నిస్సిగ్గు ప్రకటనలు చేశారు. ఉగ్రవాది బుర్హాన్ వనిని అమరవీరుడంటూ కీర్తించారు. తద్వారా పీఓకేలోని 41 స్థానాలుకుగానూ నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్- ఎన్)కి 32 సీట్లు దక్కించుకుని 'చూశారా.. ?' అన్న వెకిలి సవాల్ విసిరింది. కానీ పీఓకే ప్రజానీకం ఆ ఫలితాలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని షరీఫ్ భారీస్థాయిలో రిగ్గింగ్ కు పాల్పడ్డారని రోడ్లమీదికొచ్చి నిరసనలు తెలిపారు. ఓటర్లు బూత్ కు వెళ్లకుండానే వాళ్ల ఓట్లు పోలయ్యాయక్కడ! పాక్ ప్రభుత్వం ఎప్పటిలాగే, రోజుల వ్యవధిలోనే పీఓకే ఆందోళనకారులన్ని ఉక్కుపాదంతో అణిచేసింది. ఇక బలూచిస్థానీలైతే పాక్ బారినపడి నరకం చూస్తున్నారు.  

బెలూచిస్థాన్.. నేటి నాజీ క్యాంప్!
పాకిస్థాన్ లోని నాలుగు ఫ్రావిన్స్ లలో బెలూచిస్థాన్ ఒకటి. క్వెట్టా ప్రధాన నగరంగా ఉన్న ఈ ప్రాంతం 1947కు ముందు స్వతంత్ర రాజ్యం. ఇండియా నుంచి విడిపోయిన తర్వాత పాక్ సైన్యాలు బెలూచిస్థాన్ ను ఆక్రమించుకున్నాయి (1948 ఏప్రిల్ లో). అయితే పాక్ పాలనలో జీవించబోమంటూ బెలూచిస్థాన్ ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనలకు దిగారు. సైనిక బలంతో పాక్ బలూచ్ ప్రజలను అణగదొక్కింది. అంతటితో ఊరుకోక ఆ ప్రాంతాన్నొక 'నాజీ క్యాంప్' గా మార్చేసింది. ఎవరైనా పాక్ కు వ్యతిరేకంగా మాట్లాడితే.. వారిని, వారి కుటుంబీకులను గుట్టు చప్పుడు కాకుండా పాక్ సైన్యం అత్యంత దారుణంగా హతమారుస్తోంది. ఈ క్రమంలోనే వందమంది చిన్నారులను పాక్ సైన్యం కాల్చిచంపింది. ఈ దారుణాలపై బెలూచ్ ప్రజల్లో ఆగ్రహావేశాలు తీవ్రంగా ఉన్నాయి. అయితే భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో బెలూచ్ కు ప్రత్యక్ష మద్దతు కరువైంది. కానీ అంతర్జాతీయ వేదికలపై మాత్రం బలూచ్ తన గళం వినిపిస్తూనేఉంది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల వేదికపై బెలూచిస్థాన్ ప్రతినిధి మెహ్రాన్ పలుమార్లు పాక్ అకృత్యాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు.

మోదీ కోసం ముందే సిద్ధమైన వేదికలు
పీఓకే, బలూచిస్థాన్ లపై పాక్ దమనకాండకు వ్యతిరేకంగా దౌత్యపరమైన ఎదురుదాడి చేయాలంటూ మోదీ పిలుపునిచ్చారు. కంచెకి ఇవతలి కశ్మీరీల సమస్యలు పరిష్కరిస్తూనే, అవతలి కశ్మీరీలకూ దన్నుగా నిలుద్దామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక మద్దతును ఆశిస్తున్నానన్నారు. కాగా, బలూచిస్థానీలతోపాటు పీఓకేలో పార్టీలు, ప్రజలు ఇప్పటికే పాక్ పీడ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. నిరంతరాయంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఆ రకంగా మోదీ కోసం ముందే వేదికలు సిద్ధమై ఉన్నాయి. భారత ప్రధాని సాహసోపేత నిర్ణయానికి ఎల్లడలా మద్దతు లభిస్తోంది. అయితే బీజేపీ.. ఈ ఎత్తుగడను కూడా 'హిందూ- ముస్లిం' చట్రంలోకి తేకుండా ఉండగలిగితే మేలు. కానీ అలా జరగకుండా ఉండే అవకాశాలు తక్కువ. శుక్రవారం నాటి భేటీలో.. లోయలో పెల్లెట్ల వినియోగాన్ని నిలిపివేయాలని, ఆర్డ్మ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌(ఎఎఫ్‌ఎస్‌పీఏ)ను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందులో పెల్లెట్ల వినియోగాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ప్రత్యేక అధికారాల రద్దు క్లిష్టమే అయినా కశ్మీరీల మనసులు గెలుచుకునే క్రమంలో సాహసాలు తప్పవు.

అన్నింటికన్నా ప్రధానమైన సమస్య!
సరే, పాకిస్థాన్ ఆగడాలను ప్రపంచానికి తెలియజెప్పడంలో మోదీ సఫలమయ్యారనుకుందాం. అప్పుడు పాకిస్థాన్ ను శిక్షించడమనేది అన్నింటికన్నా ప్రధాన సమస్య. పాక్ ను ఎవరు శిక్షించాలి? ఐరాసానా? ప్రపంచ పెద్దన్న అమెరికానా? లేక చైనానా.. ఐరోపానా..? ఎవరి ప్రయోజనాల కోసం వాళ్లు పాకులాడుతున్న నేటి ప్రపంచంలో పాక్ కు వ్యతిరేకంగా భారత్ వినిపించే గళం అరణ్యరోదనగా మిగిలే అవకాశాలే ఎక్కువ. అయితే తాజా దౌత్య ఎత్తుగడవల్ల మనకు ప్రపంచం మద్దతు లభించకపోయినా.. మన కశ్మీరీలు మనవాళ్లవుతారు. అంతకంటే ఏ భారతీయుడికైనా కావాల్సింది ఏముంటుంది?

మరిన్ని వార్తలు