3 ప్రాజెక్టులు.. 4 లక్షల కోట్లు

25 Jun, 2015 03:03 IST|Sakshi
3 ప్రాజెక్టులు.. 4 లక్షల కోట్లు

స్మార్ట్ సిటీలు, అమృత్, అందరికీ ఇళ్ల ప్రాజెక్టులకు నేడు శ్రీకారం
మూడు మెగా ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించనున్న మోదీ
హౌసింగ్ మిషన్ లోగోను ఆవిష్కరించనున్న ప్రధాని
ఇది కొత్త పట్టణ శకానికి నాంది: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
మూడు పథకాలపై రెండు రోజుల వర్క్‌షాపు

న్యూఢిల్లీ: నగర భారతాన్ని సమూలంగా మార్చే దిశగా స్మార్ట్ సిటీలు సహా మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

వంద స్మార్ట్ నగరాలు, అటల్ మిషన్ ఫర్ రిజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్(అమృత్), పట్టణ ప్రాంతాల్లో 2022 నాటికి అందరికీ ఇళ్లు పథకాలకు సంబంధించి మార్గదర్శకాలను ప్రధాని విడుదల చేయనున్నారు. అలాగే హౌసింగ్ మిషన్‌కు సంబంధించిన లోగోను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 4 లక్షల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ పథకాల మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలతో ఏడాదికిపైగా చర్చలు జరిపింది. వీటిపై ప్రధాని మోదీ పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ.. అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలు తెలిపాయి.
 
వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టు కోసం రూ. 48 వేల కోట్లు, అమృత్ కోసం రూ.50 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంటుగా ఐదేళ్ల పాటు అందజేయనున్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు వచ్చే ఏడేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఖర్చుతో మురికివాడల్లో నివసించేవారు, ఆర్థికంగా బలహీనవర్గాలవారు, అల్పాదాయ వర్గాల వారికి సుమారు 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.2.3 లక్షల చొప్పున సబ్సిడీగా అందించనున్నారు. ఈ మూడు పథకాలు కొత్త పట్టణ శకానికి నాంది అని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కీలక భూమిక పోషించనున్నాయన్నారు.

స్మార్ట్ సిటీల పథకంలో భాగంగా ఎంపిక చేసిన వంద నగరాల్లో 24 గంటలు నీరు, విద్యుత్, ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థల ఏర్పాటు, మెరుగైన విద్యా వ్యవస్థ, వినోద సౌకర్యాలు, ఈ గవర్నెన్స్, పర్యావరణహిత వాతావరణ మొదలైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును పీపీపీ మోడల్‌లో చేపడతామన్నారు. అమృత్ పథకం ద్వారా లక్ష జనాభా దాటిన 500 నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికీ నీటి సౌకర్యం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ, మెరుగైన రవాణా సదుపాయం మొదలైన అంశాలపై దృష్టి పెడతామన్నారు. ఈ మూడు పథకాల మార్గదర్శకాల విడుదల అనంతరం రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో సుమారు వెయ్యి మంది వివిధ రాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ దేశాల ప్రతినిధులు పాలుపంచుకుంటారని చెప్పారు.

మరిన్ని వార్తలు