శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు

14 Feb, 2017 03:20 IST|Sakshi
శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు

- తమను నిర్బంధించలేదని పోలీసులకు వాంగ్మూలం
- కోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వ న్యాయవాది
- ఆదేశాలిస్తే, కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమన్న ప్రభుత్వ న్యాయవాది


సాక్షి, చెన్నై:
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ కువత్తూరులో ఏర్పాటు చేసిన శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు పోలీసులు, రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదికను ప్రభుత్వ న్యాయవాది రాజారత్నం మద్రాసు హైకోర్టుకు సమర్పించారు. తమను ఎవరూ నిర్బంధించలేదని, తమం తట తామే వచ్చామని వారు వాంగ్మూలం ఇచ్చినట్లు కోర్టుకు చెప్పారు. కోర్టు ఆదేశిస్తే ఎమ్మెల్యేలను హాజరుపరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు  తెలిపారు. శశికళ గోల్డెన్‌ బే రిసార్ట్‌లో నిర్బంధించిన ఎమ్మెల్యేలను విడుదల చేయించాలని దాఖ లైన పిటిషన్లను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు జయచంద్రన్, మదివాన న్‌లతో కూడిన బెంచ్‌ శుక్రవారం విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే.

కోర్టు ఆదేశాలతో కాంచీపురం జిల్లా సెయ్యారు తహశీల్దారు రామచంద్రన్, కాంచీపురం డీఎస్పీ తమిళ్‌ సెల్వన్, మహాబలిపురం డీఎస్పీ ఎడ్వర్డ్‌ నేతృత్వం లోని బృందాలు శనివారం ఆ రిసార్ట్‌లోని ఎమ్మెల్యేలను విచారించి, లిఖిత పూర్వక వాంగ్మూలం తీసుకున్నారు. అక్కడ సేకరించిన వివరాలతో కాంచీపురం జిల్లా యంత్రాంగం తరఫున సోమవారం మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కె.బాలు, వి.ప్రీత  వాస్తవాలను కప్పి పుచ్చి నివేదిక సమర్పించారని అన్నారు. ఆదేశాలిస్తే 119 మంది ఎమ్మెల్యేలను హైకోర్టులో హాజరుపరిచేందుకు ప్రభుత్వం సిద్ధమని న్యాయవాది బెంచ్‌ దృష్టికి  తీసుకెళ్లారు. దీంతో విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.

అత్యవసర కేసుగా విచారించలేం: హైకోర్టు వెల్లడి
టీనగర్‌: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను విడి పించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్‌ రామసామి దాఖలు చేసిన కేసుపై అత్యవసరంగా విచారణ చేపట్టలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అన్నాడీఎంకే పార్టీలో చీలిక ఏర్పడడంతో శశికళ జట్టుకు చేరిన ఎమ్మెల్యేలతో కూవత్తూరులోని ఒక రిసార్టులో శిబిరం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలను చట్టవిరుద్ధంగా నిర్బంధించారని పెరంబలూరు జిల్లా కున్నం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటరు ఇళవరసన్‌ ఫిర్యాదు చేశారు. అదే విధంగా మరికొంత మంది ఫిర్యాదులు చేశారు. ఈ కేసులపై వివరణ ఇవ్వా ల్సిందిగా పోలీసు డీజీపీకి మద్రాసు హైకోర్టు ఉత్వర్వులిచ్చింది. ఈకేసు న్యాయ మూర్తులు జయచంద్రన్, మదివానన్‌ సమక్షంలో సోమవారం మళ్లీ విచారణకు వచ్చింది. ఈ కేసులో తనను చేర్చుకోవాల్సిందిగా సామాజిక సేవకుడు ట్రాఫిక్‌ రామసామి న్యాయమూర్తుల ఎదుట హాజరై అభ్యర్థించారు. ఆ సమయంలో ఆయన తాను దాఖలు చేయనున్న పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఆయన కోరికను న్యాయమూర్తులు నిరాకరించారు.


తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకోం: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు
న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ఇది ఏఐఏడీఎంకే అంతర్గత విషయమని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో రాజ్యాంగ పరమైన విషయాల్లో మాత్రమే కేంద్రం స్పందిస్తుందన్నారు. ఇది కేవలం రాజకీయ వ్యవహారమని, ఇందులో కేంద్రం జోక్యం ఉండబోదన్నారు.

మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి..

శశికళ జాతకంపై నేడే తీర్పు 
నేనెవరికి మద్దతివ్వాలి? 
శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు 
సరైన సమయంలో కీలక నిర్ణయం 
శశికళకు కారాగారమా? అధికారమా? 
వారంలోగా బలపరీక్ష! 
ప్రజాక్షేత్రంలోకి శశికళ
మారువేషంలో బయటపడ్డా
చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ

 

మరిన్ని వార్తలు