‘బాస్’ఆధారాలు లభ్యం!

11 Jul, 2015 05:11 IST|Sakshi
రెండు రోజుల కస్టడీ అనంతరం సండ్రను కోర్టుకు తీసుకువచ్చిన అధికారులు

- సండ్ర రెండో రోజు ఏసీబీ కస్టడీలో కీలక అంశాలు వెల్లడి
- సెబాస్టియన్‌తో కలిపి గంటన్నర పాటు విచారణ
- ఎమ్మెల్యేల కొనుగోళ్లపై ప్రశ్నల వర్షం
- ముగిసిన సండ్ర కస్టడీ.. చర్లపల్లి జైలుకు తరలింపు
 
సాక్షి, హైదరాబాద్:
‘ఓటుకు కోట్లు’ కేసులో సూత్రధారికి సంబంధించి ఏసీబీ అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినవారి సంభాషణల్లోని ‘బాస్’, ‘సార్’ ఎవరు, వారి లక్ష్యం ఏమిటనేదానిని దాదాపు నిర్ధారించుకున్నట్లు సమాచారం. రెండు రోజుల కస్టడీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించిన ఏసీబీ అధికారులు.. ఆయన నుంచి దీనికి సంబంధించిన వివరాలు సేకరించారని తెలిసింది.

ఈ కేసులో రెండో నిందితుడు సెబాస్టియన్‌ను శుక్రవారం ఏసీబీ కార్యాలయానికి పిలిచిన అధికారులు ఆయనను సండ్రతో పాటు ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఈ కేసులో కీలకమైన ‘మిస్సింగ్ లింకు’లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక సండ్ర రెండు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో.. ఆయనను అధికారులు కోర్టులో హాజరుపరిచి, జైలుకు తరలించారు.

ఎదురెదురుగా కూర్చోబెట్టి..
కస్టడీలో తొలిరోజు సండ్ర వ్యవహార శైలిని దృష్టిలో ఉంచుకుని రెండో రోజు ఏసీబీ అధికారులు రూట్ మార్చారు. బాగా ‘తర్ఫీదు’ పొందిన సండ్ర నుంచి ఎలాగైనా సమాచారం రాబట్టేందుకు.. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్‌ను ఎదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు తెలిసింది. తద్వారా రెండో రోజు విచారణ కాస్త సఫలీకృతమైనట్లు సమాచారం. సండ్రను శుక్రవారం ఉదయం సిట్ కార్యాలయం నుంచి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తొలుత సండ్ర గన్‌మ్యాన్ లచ్చు గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్  ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.

సండ్ర మే 29న మహానాడు ముగిసిన తర్వాత 30వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లడం, తర్వాత ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌కు, అట్నుంచి లేక్‌వ్యూ అతిథి గృహానికి వెళ్లడం వంటి అంశాలను లచ్చు తన వాంగ్మూలంలో వివరించారు. ఇలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఏసీబీ అధికారులు సండ్రను సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే సండ్ర వీటికి కూడా పార్టీ పనులు, ఇతర వ్యవహారాలు అంటూ అస్పష్టమైన సమాధానాలే ఇవ్వడానికి ప్రయత్నించారని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.

మే 31న రేవంత్‌రెడ్డి నేరుగా రూ.50 లక్షలు తీసుకుని స్టీఫెన్‌సన్ నివాసానికి వెళ్లడం పట్ల సండ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏసీబీ వద్ద సమాచారం ఉంది. అందుకు అనుగుణంగా ‘ఎమ్మెల్యేలను ఎవరు కొనుగోలు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, తదితర అంశాలు మీకు ముందే తెలుసా?..’ అని సండ్రను ప్రశ్నించినట్లు సమాచారం. కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్‌ను పిలిపించి ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి గంటన్నర పాటు ప్రశ్నించగా... ఈ  కేసుకు సంబంధించిన అనేక మిస్సింగ్ లింకులు బయటకు వచ్చినట్లు తెలిసింది.

జైలుకు తరలింపు
శుక్రవారం సండ్ర కస్టడీ గడువు ముగియడంతో ఏసీబీ అధికారులు ఆయనను ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. ఈనెల 21 వరకు రిమాండ్‌కు తరలించాలని న్యాయమూర్తి లక్ష్మీపతి ఆదేశించారు. కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, మంచి ఆహారం ఇచ్చారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అన్నీ మంచిగానే చూశారని సండ్ర చెప్పారు. అనంతరం పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.
 
జనార్దన్ పాత్రపై ఆరా..
సండ్ర, సెబాస్టియన్ మధ్య సాగిన ఫోన్ సంభాషణల్లో తెరపైకి వచ్చిన జనార్దన్ ఈ వ్యవహారంలో పోషించిన పాత్ర పట్ల ఏసీబీ ప్రత్యేకంగా ఆరా తీసింది. మే 30న ఉదయం బాబు నివాసం నుంచి నేరుగా ఎన్టీఆర్‌భవన్‌కు వెళ్లినది జనార్దన్‌ను కలవడానికేనా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జనార్దన్ నేతృత్వంలోనే జరిగిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.

ఇలా వీరిని కలిపి, వేర్వేరుగా విచారించిన అధికారులు... ‘బాస్’తో పాటు జనార్దన్‌కు సంబంధించిన కీలక అంశాలను సేకరించారని తెలిసింది. వీటి ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తూ కేసుతో సంబంధమున్న వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సోమవారం నుంచి ‘ఓటుకు కోట్లు’ కేసులో ‘పెద్దలకు’ సంబంధించిన కీలక ఘట్టం ప్రారంభం కానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు