రాహుల్‌లో మార్పు కనిపిస్తోంది

6 Nov, 2015 08:11 IST|Sakshi
రాహుల్‌లో మార్పు కనిపిస్తోంది

* రాజకీయాల్లో కీలక భూమికకు రాహుల్ నిర్ణయం
* ప్రముఖ రచయిత్రి నయనతార సెహగల్ ప్రశంసలు


చండీగఢ్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రముఖ రచయిత్రి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బంధువైన నయనతార సెహగల్ ప్రశంసల వర్షం కురిపించారు. చండీగఢ్‌లో గురువారం జరిగిన నాలుగో సాహిత్య ఉత్సవాల్లో ఆమె మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కీలక భూమికను నిర్వహించాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారని అన్నారు.

రాహుల్‌పై మీ అభిప్రాయం ఏమిటని విలేకరులు ఆమెను ప్రశ్నించినప్పుడు సెహగల్ స్పందించారు. ‘తొలినాళ్లలో నేను కూడా అందరిలాగానే భావించాను. రాహుల్ రాజకీయాల్లో ఉండతగిన వాడు కాదని అనుకున్నా. అతను వేరే వృత్తిని స్వీకరించటం మంచిదని కూడా భావించాను. కానీ.. బిహార్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది. వాస్తవాలను ప్రజలముందుంచటంలో ఆయన విజయం సాధించారు.

ఇక తాను పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. అంతకుముందు తెరవెనుక ఉండి యువజన కాంగ్రెస్‌ను వ్యవస్థీకృతం చేయటంపై దృష్టి సారించారు. ఇప్పుడు ఇక పెద్ద పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారు. ఆయనలో గొప్ప మార్పు కనిపిస్తోంది. ఇది చాలా మంచి, అనుకూల పరిణామం.’ అని సెహగల్ అన్నారు. దాద్రీలో ఇఖ్లాక్ హత్య ఘటన నేపథ్యంలో తాను అందుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె దారిలో ఇప్పటివరకు 75మందికి పైగా సాహిత్య కారులు, కళాకారులు, మేధావులు తమ అవార్డులు వెనక్కి ఇచ్చేశారు.

తాను మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూల నుంచి తీవ్రంగా ప్రభావితం అయ్యానని, తనకు రెండు సార్లు పార్లమెంటు సీటు ఇస్తామన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ తాను తిరస్కరించానని సెహగల్ తెలిపారు. తాను ఎన్నడూ అధికారాన్ని, ఆస్తుల్ని కోరుకోలేదని.. తన కథలకు కథాంశంగా దేశ రాజకీయాలు పనికివచ్చాయని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు