హైదరాబాద్‌ విద్యార్థి అరుదైన ఘనత!

24 Sep, 2016 20:22 IST|Sakshi
హైదరాబాద్‌ విద్యార్థి అరుదైన ఘనత!

హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి రాహుల్‌ రమేశ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యున్నత వైద్య కళాశాలలైన ఇంపీరియల్‌ కాలేజ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, క్వీన్‌ మేరీ మేడికల్‌ స్కూల్‌, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ మెడికల్‌ స్కూల్‌ లలో రాహుల్‌కు ఎంబీబీఎస్‌ కోర్సులో అడ్మిషన్‌ లభించింది. ఈ మూడు కాలేజీలు కూడా బ్రిటన్‌లోని లండన్‌లోనే ఉన్నాయి.

యేల్‌ అనుబంధ సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రి మెడికల్‌ కోర్సు చేసిన రాహుల్‌ రమేశ్‌.. యూకే క్యాట్‌,బీమ్యాట్‌, శాట్‌ వంటి కఠినమైన రాత పరీక్షలు, ప్యానెల్‌ ఇంటర్వ్యూలు, స్కూల్‌ పర్ఫార్మెన్స్‌ రివ్యూలను విజయవంతంగా అధిగమించి ఈ ప్రతిష్టాత్మక కళాశాలల్లో అడ్మిషన్‌ సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా 15మంది విద్యార్థులు మాత్రమే ఈ ఘనత సొంతం చేసుకోగా.. అందులో రాహుల్‌ ఒకరు. భారత్‌ నుంచి ఈ ఘనత సొంతం చేసుకున్న ఏకైక విద్యార్థి రాహుల్‌ మాత్రమే.

ప్రతిష్టాత్మక ఇంపీరియల్‌ కాలేజ్‌ మెడికల్‌ స్కూల్‌లో ఎంబీబీఎస్‌ కోర్సు చేయాలని రాహుల్‌ నిర్ణయించుకున్నాడు. అక్టోబర్‌ 1 నుంచి అతను కోర్సు చేయనున్నాడు. 2015 టైమ్స్‌ హయర్‌ ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే ఐదో ఉత్తమ కళాశాలగా, యూరప్‌లో రెండో బెస్ట్‌ మెడికల్‌ కాలేజీగా ఇంపీరియల్‌ కాలేజీ నిలిచింది. అంతర్జాతీయ పోటీ ద్వారా ఇంపీరియల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ కోర్సుకు ఎంపికైన మొదటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యార్థి రాహుల్‌ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు