5.5% వృద్ధి రేటు సాధ్యమే..

5 Oct, 2013 02:27 IST|Sakshi
5.5% వృద్ధి రేటు సాధ్యమే..

రాయ్‌పూర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగానే 5-5.5 శాతంగా ఉండగలదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఖరీఫ్ పంటల దిగుబడి, ఎగుమతులు, మౌలిక పరిశ్రమల పనితీరు మెరుగ్గా ఉండగలదన్న అంచనాల నేపథ్యంలో .. దీని గురించి సందేహించాల్సిన అవసరమేమీ కనిపించడం లేదన్నారు. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం రాజన్ ఈ విషయాలు తెలిపారు. ‘గతేడాది కన్నా ఈసారి ఖరీఫ్ దిగుబడి అంచనాలు మెరుగ్గా ఉన్నాయి. మౌలిక రంగం పనితీరు మెరుగుపడుతోంది.

ఎగుమతులు కూడా కాస్త పుంజుకుంటాయేమో చూడాలి. మొత్తం మీద 5-5.5 శాతం వృద్ధి స్థాయిని సాధించగలమనే ఆశిస్తున్నాను’ అని రాజన్ పేర్కొన్నారు. 2012-13లో దశాబ్ద కనిష్టం 5 శాతానికి పడిపోయిన వృద్ధి రేటు.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4.4 శాతానికి క్షీణించిన సంగతి తెలిసిందే. దీంతో 2013-14లో వృద్ధి అంచనాలను ఆసియా అభివృద్ధి బ్యాంకు 6 శాతం నుంచి ఏకంగా 4.7 శాతానికి కుదించింది. అటు ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) సైతం 6.4 శాతం నుంచి 5.3 శాతానికి అంచనాలను కుదించిన నేపథ్యంలో తాజాగా వృద్ధిపై రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
 చౌక రుణాలపై కసరత్తు..
 ద్విచక్ర వాహనాలు, వినియోగ వస్తువుల కొనుగోళ్ల కోసం తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనంగా నిధులు సమకూర్చే స్కీముపై ఇంకా కసరత్తు జరుగుతోందని రాజన్ తెలిపారు. ఏ విధంగా దీన్ని అమలు చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు బడ్జెట్‌లో పేర్కొన్న రూ. 14,000 కోట్ల కంటే అదనంగా పెట్టుబడులు సమకూర్చాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు అధిక వడ్డీరేట్ల కారణంగా రుణాలు తీసుకోవడానికి వెనుకాడుతున్న కొనుగోలుదారులకు, మరోవైపు డిమాండ్ లేక కుదేలవుతున్న పరిశ్రమకి ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా స్వాప్ విధానం ద్వారా సెప్టెంబర్ 4 నుంచి ఇప్పటిదాకా 5.6 బిలియన్ డాలర్లు వచ్చినట్లు రాజన్ పేర్కొన్నారు.

రాష్ట్రాలపై నివేదిక సరైనదే..
రాష్ట్రాల వెనుకబాటుతనంపై నివేదిక విషయానికి సంబంధించి పలు అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుందని రాజన్ పేర్కొన్నారు. అయితే, తొలి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు చాలా సంపన్నమైనవని, దిగువ స్థాయిలో ఉన్న పది రాష్ట్రాలు అత్యంత పేద రాష్ట్రాలని భావించనక్కర్లేదని ఆయన చెప్పారు. ఫార్ములా ప్రకారం స్కోరు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని, అదే విధంగా మెరుగైన పనితీరు కనపర్చినా కూడా ఎక్కువ నిధులు దక్కే అవకాశాలూ ఉన్నాయని రాజన్ పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో మిగతా వివాదాలేమైనా ఉంటే అవన్నీ రాజకీయపరమైనవేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల స్థితిగతులపై రాజన్ కమిటీ ఇచ్చిన నివేదికలో గోవా, కేరళకు సంపన్న రాష్ట్రాలుగాను, ఒడిసా..బీహార్‌లకు అత్యంత వెనుక బడ్డ రాష్ట్రాలుగాను పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, తన మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కట్టబెట్టేందుకు కేంద్రం ఇలాంటి గిమ్మిక్కులు చేస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత ఆర్‌బీఐ నివేదికను కొట్టిపారేశారు.

>
మరిన్ని వార్తలు