ఆర్‌బీఐ చర్యలతో విదేశీ విస్తరణకు బ్రేక్

17 Aug, 2013 02:47 IST|Sakshi
న్యూఢిల్లీ: దేశం నుంచి విదేశీ కరెన్సీ తరలిపోకుండా విదేశాల్లో పెట్టే పెట్టుబడులపై పరిమితులు విధించాలన్న ఆర్‌బీఐ నిర్ణయంతో.. ప్రపంచ స్థాయిలో ఎదగాలనుకుంటున్న దేశీ సంస్థల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుందని కార్పొరేట్లు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ త్వరలోనే వీటిని పునఃసమీక్షించి మళ్లీ యథాతథ స్థితి పునరుద్ధరించగలదని కంపెనీల సమాఖ్య సీఐఐ ఆశాభావం వ్యక్తం చే సింది. రూపాయిని స్థిరీకరించాలనుకుంటే... బొగ్గు, ముడి ఖనిజం వంటి నిత్యావసరయేతరాలు వెల్లువలా వచ్చి పడిపోకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని, అలాగే విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు అనువైన పరిస్థితులు కల్పించేలా చర్యలూ చేపట్టవచ్చని సూచించింది. 
 
 రానున్న రోజుల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై కూడా మరిన్ని ఆంక్షలు విధించవచ్చన్న ఆందోళనలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు ఇంతకన్నా దుర్భరంగా ఉన్న సమయంలో కూడా భారత్ ఎప్పుడూ కూడా డివిడెండ్లు మొదలైన విదేశీ చెల్లింపులపై ఆంక్షలు విధించలేదన్నారు.  మరోవైపు, పెట్టుబడులపై పరిమితులు విధిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు.... రూపాయి పతనాన్ని మరింత తీవ్రతరం చేశాయని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ పేర్కొంది. భారత్ వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడంలో గణనీయమైన పురోగతి చూపిస్తే తప్ప.. రూపాయి మరింతగా క్షీణిస్తూనే ఉంటుందని వివ రించింది. ఎగుమతులు మెరుగుపడితే.... రూపాయి కోలుకోగలదని పేర్కొంది. 
 
మరిన్ని వార్తలు