పార్లమెంట్‌లో కాంగ్రెస్ గూండాగిరి

15 Feb, 2014 01:52 IST|Sakshi
పార్లమెంట్‌లో కాంగ్రెస్ గూండాగిరి

* సీమాంధ్ర ఎంపీల ధ్వజం
* ఇతర రాష్ట్రాల ఎంపీలను పెట్టి కొట్టించారు
* కాంగ్రెస్ చెప్పినట్లు స్పీకర్ నడుస్తున్నారు
* టెన్ జనపథ్ నుంచే ఫ్లోర్ మేనేజ్‌మెంట్
* లోక్‌సభ వీడియోలను ప్రజల ముందుంచుతాం
 
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ గూండాగిరి చేస్తోందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీలను మోహరింపజేసి తమపై దాడి చేయించారని వాపోయారు. విభజన బిల్లు విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పెద్దలతో పోలిస్తే లోక్‌సభలో లగడపాటి రాజగోపాల్ చేసిన పని చాలా చిన్నదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ను సజావుగా నడపాల్సిన లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సైతం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం కాంగ్రెస్ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సభలో ఎవరు ఎవరిపై దాడి చేశారో... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరనే విషయంపై లోక్‌సభ వీడియో పుటేజీలను సేకరించి ప్రజల ముందుంచుతామని తెలిపారు.
 
  కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో శుక్రవారం ఉదయం ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, జి.హర్షకుమార్, సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్ తదితరులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై గంటకుపైగా చర్చించారు. లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలకు తమను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నందున వాస్తవాలను బయటపెట్టేందుకు లోక్‌సభ వీడియో దృశ్యాలను సేకరించాలని నిర్ణయించారు. దీంతోపాటు విభజన బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి వివరించేందుకు సిద్ధమయ్యారు. అనంతరం ఆయా నేతలు మీడియాతో మాట్లాడారు.
 
 ఆ మూడూ సవరిస్తే విభజనకు ఓకే: కావూరి
 రాష్ట్రాల విభజనకు శాస్త్రీయ విధానం ఉండాలి.  ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు చేయలేదు? ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని ఈ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే ఎందుకు విడదీస్తున్నారు? మేము ప్రతిపాదించిన మూడు సవరణలకు కేంద్రం సోమవారంలోగా అంగీకరిస్తే రాష్ర్ట విభజనకు సహకరిస్తాం. హైదరాబాద్‌ను పదేళ్లపాటైనా యూటీ చేయాలి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలి. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి. వీటిని అంగీకరించకపోతే తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం.
 
 నేనూ సిగ్గుపడుతున్నా: లగడపాటి
 లోక్‌సభలో గురువారం జరిగిన పరిణామాలపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. అలాంటి చర్యలు ఎవరు చేసినా ఆక్షేపణీయమే. అందుకు నేను సిగ్గుపడుతున్నా. నిన్నటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులేమిటో అందరికీ తెలియాల్సిన అవసరముంది. మాపై దాడి చేయడానికి వందమంది ఎంపీలు వచ్చారు. నా సహచర ఎంపీపైనా దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసమే పెప్పర్‌స్ప్రే ఉపయోగించాను.
 
 మమ్మల్నే ఎందుకు సస్పెండ్ చేశారు?: హరి
 కాంగ్రెస్ అప్రజాస్వామికంగా బిల్లును ప్రవేశపెట్టింది. గురువారం సుమారు వందమంది ఎంపీలు వెల్‌లోనే ఉండి ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలను మాత్రమే ఎందుకు సస్పెండ్ చేశారు? పార్లమెంట్ ఏమైనా జన్‌పథ్ అనుకుంటున్నారా?
 
 జన్‌పథ్ నుంచి పంపిస్తే తెలుస్తుంది: హర్షకుమార్
 రాష్ట్రాన్ని విడగొట్టి మమ్మల్ని హైదరాబాద్ నుంచి పంపుతామంటున్నారు. మిమ్మల్ని (సోనియాగాంధీని ఉద్దేశించి) జన్‌పథ్ నుంచి పంపితే ఎంత బాధ ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. పార్లమెంట్‌లో ఫ్లోర్ మేనేజ్‌మెంట్ అంతా జన్‌పథ్ నుంచే నడిస్తోంది. దీనికి కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు.
 
 సీట్ల కోసం విభజిస్తారా?: సాయిప్రతాప్
 తెలంగాణలో సీట్లు రావాలనే ఉద్దేశంతోనే  కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది. తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ప్రతిపక్షాలకు తెలీకుండా పార్లమెంట్‌లో బిల్లును పెడుతున్నారు. ఇంతకంటే అప్రజాస్వామిక చర్య ఏముంటుంది?
 
 సస్పెన్షన్ ఎత్తివేయండి
 స్పీకర్‌కు లగడపాటి, సబ్బం లేఖలు
 సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి తమను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం నిర్హేతుకం, అన్యాయమైనదని ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి పేర్కొన్నారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు వేర్వేరుగా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. ఈ సస్పెన్షన్ ఎత్తివేసి నిజమైన ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటు విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నామంటూ ఇద్దరు సభ్యులు విడివిడిగా లేఖలు రాశారు.

మరిన్ని వార్తలు