నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

9 Sep, 2016 09:42 IST|Sakshi
న్యూఢిల్లీ : అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉత్తర కొరియా అణు పరీక్ష అనుమానాలతో ఆసియన్ మార్కెట్లు పడిపోతుండటంతో, సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పతనమవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్  114.84 పాయింట్ల నష్టంతో 29వేల దిగువకు 28930 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 41.95 పాయింట్ల నష్టంతో 8910 వద్ద కొనసాగుతోంది. ప్రైవేట్ రంగ బ్యాంకు ఎస్ బ్యాంకు దాదాపు 6 శాతం మేర డౌన్ అవుతూ.. నిఫ్టీలో టాప్ లూజర్గా నష్టాలను గడిస్తోంది.
 
అదేవిధంగా బీహెచ్ఈఎల్, హీరో మోటార్ కార్పొ సెన్సెక్స్లో నష్టాలను చవిచూస్తున్నాయి. బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, సిప్లా, మహింద్రా అండ్ మహింద్రా, టీసీఎస్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. అమెరికా డాలర్ రికవరీ అవడంతో వరుసగా రెండో సెషన్లో కూడా రూపాయిల విలువ పడిపోతోంది. ముందటి ముగింపుకు 16 పైసలు బలహీనపడిన రూపాయి మారకం 66.57గా ప్రారంభమైంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 90 రూపాయల నష్టంతో 31,215 వద్ద కొనసాగుతోంది. 
 
మరిన్ని వార్తలు