సెన్సెక్స్ దూకుడు.. 405 పాయింట్ల ర్యాలీ

30 Aug, 2013 01:37 IST|Sakshi
సెన్సెక్స్ దూకుడు.. 405 పాయింట్ల ర్యాలీ
రిజర్వ్ బ్యాంకు చేపట్టిన తాజా చర్యల ప్రభావమో లేక షార్ట్ కవరింగ్ మహత్మ్యమో... రూపాయి ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. మూడు రోజుల నష్టాలకు చెక్‌పెడుతూ ఏకంగా 3%(225 పైసలు) హైజంప్ చేసి 66.55 వద్ద ముగిసింది. డాలరుతో మారకంలో ఉదయమే ఊపందుకున్న రూపాయి ప్రభావంతో స్టాక్ మార్కెట్లలోనూ జోష్ వచ్చింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ లాభాలతో మొదలైంది. ఆపై ఏక్షణంలోనూ వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లింది. 
 
 ట్రేడింగ్ ముగిసేసరికి 405 పాయింట్ల మారథాన్ పూర్తిచేసుకుని 18,401 వద్ద స్థిరపడింది. ఇదే విధంగా స్పందించిన నిఫ్టీ కూడా 124 పాయింట్లు ఎగసి 5,400 పాయింట్ల కీలక స్థాయికి ఎగువన నిలిచింది. 5,409 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గడం కూడా సెంటిమెంట్‌ను మెరుగుపరచిందని విశ్లేషకులు తెలిపారు. కాగా, రూపాయి బలపడటం, చమురు ధరలు తగ్గడంతో ఆయిల్ షేర్లు పుంజుకున్నాయి. ఆర్‌ఐఎల్ 4% జంప్‌చేయగా, గెయిల్, ఓఎన్‌జీసీ, ఐవోసీ 2-1.5% మధ్య లాభపడ్డాయి. వెరసి బీఎస్‌ఈలో ఆయిల్ ఇండెక్స్ అత్యధికంగా 3% పురోగమించింది. ఈ బాటలో అన్ని రంగాలూ లాభపడినప్పటికీ మెటల్, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాలు సైతం 2%పైగా పుంజుకున్నాయి.
 
 సెసా గోవా దూకుడు
 సెన్సెక్స్‌లో 5 షేర్లు మాత్రమే నష్టపోగా, కోల్ ఇండియా 1.5% క్షీణించింది. మరోవైపు సెసా గోవా 13.5% దూసుకెళ్లింది. ఈ బాటలో హెచ్‌డీఎఫ్‌సీ 6.3% జంప్‌చేయగా, టెలికం దిగ్గజాలు ఆర్‌కామ్ 8%, భారతీ 4%, ఐడియా 4.5% చొప్పున లాభాల మోత మోగించాయి. ఈ బాటలో హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, ఎన్‌టీపీసీ, హీరో మోటో, భెల్, ఐటీసీ, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్, ఎంఅండ్‌ఎం, టీసీఎస్ సైతం 5-2% మధ్య పురోగమించాయి. ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 248 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 76 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
 
 మిడ్ క్యాప్స్ జోరు
 పుంజుకున్న సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.5% బలపడింది. ట్రేడైన షేర్లలో 1,274 లాభపడగా, 990 మాత్రమే క్షీణించాయి. మిడ్ క్యాప్స్‌లో ఆమ్టెక్ ఇండియా, ముత్తూట్ ఫైనాన్స్ 19% చొప్పున దూసుకెళ్లగా, నాల్కో, ఇండియా ఇన్ఫోలైన్, జీవీకే పవర్, జీఎస్‌ఎఫ్‌ఎల్, రెలిగేర్, భారత్ ఫోర్జ్, కొటక్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ టీవీ, ఫాగ్ బేరింగ్స్, అమరరాజా, స్టెరిలైట్ టెక్, క్రాంప్టన్ గ్రీవ్స్ 14-6% మధ్య లాభపడ్డాయి. నగదు విభాగంలో బీఎస్‌ఈ నుంచి రూ. 2,190 కోట్లు, ఎన్‌ఎస్‌ఈ నుంచి రూ. 15,790 కోట్లు చొప్పున టర్నోవర్ నమోదుకాగా, ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌వోలో చివరి రోజు కావడంతో రూ. 3,20,958  కోట్లు జరిగింది.
 
మరిన్ని వార్తలు