10 నిమిషాల ఆలస్యమే ప్రాణాలను బలి తీసుకుందా!

5 Aug, 2015 10:00 IST|Sakshi
10 నిమిషాల ఆలస్యమే ప్రాణాలను బలి తీసుకుందా!

భోపాల్: అప్పుడే భోజనం ముగించుకుని నిద్రకు ఉపక్రమిస్తున్న ప్రయాణికులు తాము శాశ్వత నిద్రలోకి జారుకోబోతున్నట్లు కలలోనూ ఊహించి ఉండరు! క్షణాల్లో మనిషి ప్రాణాన్ని హరించే మృత్యువుకు.. 10 నిమిషాల సమయం దొరికితే విలయతాండవం చేయకుండా ఉంటుందా! మధ్యప్రదేశ్ ఘోర రైలు ప్రమాదం జరిగిన తీరుపై ఇలాంటి భావన అనేకం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ప్రమాదానికి 10 నిమిషాల ముందు కూడా మాచక్ నదిపై ఉన్న ఆ వంతెన పటిష్టంగానే ఉంది. ఆ మార్గంలో పలు రైళ్లు ప్రయాణించాయి కూడా.

మంబైలోని లోకమాన్య తిలక్ టెర్మిన్ నుంచి మద్యాహ్నం 12:40 గంటలకు బయలుదేరాల్సిన కామయాని ఎక్స్ ప్రెస్ (ట్రైన నంబర్ 11072) మంగళవారం షెడ్యూల్ కంటే 6 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. మొత్తం 42 స్టేషన్లలో ఆగే ఈ రైలు 18వ స్టేషనైన ఖిర్కియాకు చేరుకునే సరికి ఆ ఆలస్యం 10 నిమిషాలకు పెరిగింది. అక్కడినుంచి 19వ స్టాప్ హర్దాకు బయలుదేరిన కొద్దిసేపటికే మాచక్ నదిపై ఉన్న వంతెన వద్ద ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో రైలు గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. 'కామయాని ఎక్స్ ప్రెస్ తరువాత మరో అరగంటకుగానీ  ఆ వంతెన గుండా మరో రైలు వెళ్లదు. ఈ లోగా ట్రాక్ కొట్టుకుపోయిన సమాచారం రైల్వే అధికారులకు అంది రైళ్ల రాకపోకలు నిలిచిపోయేవేమో!' అని అధికార వర్గాలు చర్చించుకోవడం గమనార్హం.

 

ఇండియన్ రైల్వేస్ చైర్మన్ ఏకే మిట్టల్ ప్రమాదంపై స్పందిస్తూ..  'కామయాని ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడానికి 10 నిమిషాల వరకు అక్కడి వంతెన బాగానే ఉంది. భారీ వర్షాలు కరుస్తుండటంతో వరద ఒక్కసారిగా దూసుకొచ్చి వంతెన కిందున్న మట్టి, కంకరను కొట్టుకుపోయేలా చేసింది. సమాచారం లేకపోవడంతో డ్రైవర్ రైలును యథావిధిగా నడిపాడు. కామయాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన కొద్ది సేపటికే జబల్ పూర్ నుంచి ముంబై వెళుతోన్న జనతా ఎక్స్ ప్రెస్ అదే ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. మొత్తం 16 బోగీలు వంతెనపై నుంచి కిందకి పడిపోయాయి. ఇప్పటివరకు 27 మృతదేహాలు వెలికితీశాం. వందల మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించాం' అని వివరించారు.

మరిన్ని వార్తలు