34సార్లు పాములు కరిచినా తప్పించుకోగలిగింది

21 Feb, 2017 12:21 IST|Sakshi
34సార్లు పాములు కరిచినా తప్పించుకోగలిగింది
శ్రీమౌర్ : 34 సార్లు పాములు కరిచిన తర్వాత ఎవరైనా బతికి ఉన్నారని ఎప్పుడైనా విన్నారా? నిజంగా ఆశ్చర్యం. హిమచల్ ప్రదేశ్లోని శ్రీమౌర్లో 18 ఏళ్ల మనీషా అనే అమ్మాయి 34 సార్లు పాములు కరిచినా.. వాటి విషం నుంచి తప్పించుకోగలిగింది. గత మూడేళ్లలో ఆ అమ్మాయి 34 సార్లు పాము కాటుకు గురైంది. మొదటిసారి ఆ అమ్మాయి తమ స్థానిక నది సమీపంలో పాము కరిచింది. స్కూల్ డేస్లో తనను చాలా సార్లు పాము కరిచిందని, ఒక్కోసారి రోజుకు రెండు లేదా మూడు సార్లు పాము కాటుకు గురయ్యే దానినని మనీషా చెబుతోంది. అయితే తనకు నాగ దేవతకు ఏదో సంబంధం ఉండటం వల్లే పాము కాటు తనను ఏం చేయలేకపోతుందని జ్యోతిష్యులు, పూజారులు చెప్పినట్టు ఆ అమ్మాయి పేర్కొంటోంది.
 
కానీ విషం లేని, తక్కువ విషం కలిగిన పాములు కుట్టడం వల్లనే మనీషా ప్రాణానికి ప్రమాదం తప్పుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం  ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మనీషాకు 34 సార్లు పాములు కరిచినట్టు గుర్తించినట్టు తెలిసింది.  ఫిబ్రవరి 18న పాము కరిచిన కారణంగా మనీషా ఆసుపత్రిలో జాయిన్ అయిందని డాక్టర్ వైఎస్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మెడికల్ సూపరిటెండెంట్ చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
 
''పాము కాటుకు గురైన లక్షణాలతో మనీషా ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఇది విషం లేని పాముగా గుర్తించాం. ఇక్కడ ఉండే 80 శాతానికి పైగా పాముల్లో విషం ఉండదు'' అని డాక్టర్ కేకే ప్రసాద్ తెలిపారు. మనీషా పాము కాటుకు గురవ్వడం రొటీన్ అయిపోయిందని ఆమె తండ్రి సుమెర్ వర్మ చెబుతున్నాడు. అయితే తరుచు ఆమెను పాములు కరవడంతో మనీషా శరీరంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పెరిగి, పాము కాటు నుంచి తప్పించుకునే ప్రక్రియ ఉత్పన్నమవుతుందని హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ అటవీ శాఖ పశువైద్యుడు డాక్టర్ రోహిత్ చెబుతున్నారు. 
 
మరిన్ని వార్తలు