చెత్త బయట వేస్తే జరిమానా

29 Jun, 2015 02:35 IST|Sakshi

స్వచ్ఛ భారత్ పటిష్ట అమలుకు కొత్త చట్టం
న్యూఢిల్లీ: ఆరు బయట చెత్త వేస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ మూత్రం పోస్తున్నారా? పాన్‌లు నమిలి రోడ్డుపై ఉమ్మి వేస్తున్నారా? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండండి. లేదంటే జరిమానా, శిక్ష తప్పదు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ కేంద్రం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. దీన్ని పటిష్టంగా అమలు చేసేందుకు న్యాయపరమైన మద్దతు ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు న్యాయ శాఖ బిల్లును తయారు చేస్తోంది.

కానీ పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలు రాష్ట్రాల పరిధిలోనివి కావడంతో చట్టం అమలు సాధ్యం కాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కేంద్రం వెలుసుబాటు కల్పిస్తోంది. అయితే పరిశుభ్రత, పారిశుద్ధ్యం అనే వాటికి పరిధి ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదైనా ఒక ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ వస్తే అది దేశం మొత్తం వ్యాపిస్తుందని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.  
 
అక్కడికక్కడే చలానాలు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు అప్పటికప్పుడు చలానాల రూపంలో జరిమానా విధిస్తున్నట్లే దీని విషయంలో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత విషయంలో నిబంధనలు అతిక్రమించిన వారికి అక్కడికక్కడే జరిమానా వేయనున్నారు.

మరిన్ని వార్తలు