మూడుచింతలపల్లికి సీఎం కేసీఆర్‌ వరాలు

8 Aug, 2017 14:48 IST|Sakshi

మేడ్చల్‌: వచ్చే ఏడాది జూన్‌ నాటికి మేడ్చల్‌ జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం మేడ్చల్‌ జిల్లాలోని మూడుచింతలపల్లిలో ఏర్పాటుచేసిన గ్రామసభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని 374 చెరువులను గోదావరి జలాలతో నింపుతామని రైతులకు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మూడుచింతలకు పలు వరాలు ప్రకటించారు. ప్రత్యేకరాష్ట్రం కోసం అమరుడైన వీరారెడ్డి పేరుతో గ్రామంలో ప్రాథమిక వైద్యశాల నిర్మిస్తామని చెప్పారు. రూ.75 లక్షల వ్యయంతో విలేజ్‌ కమ్యూనిటీ హాల్‌, రూ.30 లక్షలతో మహిళా సంఘాల కోసం భవనం నిర్మిస్తామని ప్రకటించారు. మూడుచింతలపల్లి సహా కేశవరం, లక్ష్మాపూర్‌, మరో మూడు గ్రామాలకు రూ.5 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. లింగాపూర్‌ తండాను త్వరలోనే పంచాయితీగా మారుస్తామని హామీ ఇచ్చారు.