తెలుగు కళాకారులకు అవార్డులు

13 Jun, 2015 01:33 IST|Sakshi
తెలుగు కళాకారులకు అవార్డులు

రాధేశ్యామ్, దుర్గాప్రసాద్‌లకు ‘సంగీత నాటక’ పురస్కారాలు
న్యూఢిల్లీ/కూచిపూడి/విజయనగరం టౌన్: సంగీత నాటక అకాడమీ అందించే ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఇద్దరు తెలుగు వారు ఎంపికయ్యారు. 2014 ఏడాదికి సంబంధించి సంగీతం, నాట్యం, నాటకం తదితర రంగాల్లో మొత్తం 36 మందిని ఎంపిక చేయగా.. వీరిలో తెలుగువారైన కూచిపూడి నాట్యకళాకారుడు వేదాంతం రాధేశ్యామ్, వయొలిన్ విద్వాంసుడు ద్వారం దుర్గాప్రసాద్ రావు ఉన్నారు. వీరిని కూచిపూడి, వయొలిన్ విభాగాల్లో ఎంపిక చేశారు.

విజేతల వివరాలను శుక్రవారం ఢిల్లీలో అకాడమీ కార్యదర్శి హెలెన్ ఆచార్య వెల్లడించారు. విజేతలకు రూ. లక్ష చొప్పున నగదు, తామ్రపత్రాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. అయితే, అవార్డు ప్రదాన తేదీని ఇంకా ఖరారు చేయలేదు.  కాగా, అకాడమీ ఫెలోషిప్‌లకు 40 మంది కళాకారులను ఎంపిక చేశారు.
 
రాధేశ్యామ్ కళాప్రతిభ... రాధేశ్యామ్‌కు సంగీత నాటక అవార్డు ప్రకటించడంతో ఆయన స్వగ్రామమైన ఏపీలోని కృష్ణాజిల్లా కూచిపూడి వాసులు సంబరాలు చేసుకున్నారు. రాధేశ్యామ్.. సత్యనారాయణ, సత్యవతమ్మలకు 1954లో జన్మించారు. ఐదో ఏట నుంచే అన్నగారైన  సీతారామశాస్త్రి, పినతండ్రి పార్వతీశం వద్ద నాట్యంలో శిక్షణ పొందారు. సత్యభామగా, గొల్లభామగా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. 2014లో మైసూర్‌లోని అవధూత దత్తపీఠం ఆస్థాన విద్వాంసుడిగా నియమితులయ్యారు. కూచిపూడిలోని శ్రీసిద్ధేంద్ర కళాక్షేత్రంలో అధ్యాపకుడిగా పనిచేసి 2013లో ఉద్యోగ విరమణ చేశారు.
 
దుర్గాప్రసాద్ ప్రస్థానం... ద్వారం దుర్గాప్రసాద్ రావు కుటుంబమంతా సంగీతానికే అంకితమైంది. తండ్రి నరసింగరావు సంగీత కళాశాల అధ్యక్షులుగా పనిచేశారు. ఆకాశవాణి నిర్వహించిన అఖిల భారత సంగీత సమ్మేళనంలో దుర్గాప్రసాద్ చిన్నతనంలోనే విజేతగా నిలిచి నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా అవార్డు అందుకున్నారు. విజయనగరం సంగీత కళాశాలలో అధ్యక్షులుగా పనిచేసి పదవీ విర మణ చేశారు.

మరిన్ని వార్తలు