బిహార్‌లో ప్రపంచ రికార్డు

21 Jan, 2017 16:21 IST|Sakshi
బిహార్‌లో ప్రపంచ రికార్డు

పట్నా: దేశంలో మూడో అతిపెద్ద రాష్ట్రం బిహార్‌లో 11,000 కిలోమీటర్ల పొడవైన మానవహారాన్ని నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మద్యపానాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ అమలుచేస్తోన్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ​ప్రజలంతా శుక్రవారం రోడ్లపైకి వచ్చారు. చిన్నా, పెద్దా చేతులు కలిపారు. అలా నగరాలు, పట్టణాలు, గ్రామాలను కలుపుతూ దాదాపు 45 నిమిషాలపాటు(మధ్యాహ్నం 12:15 నుంచి 1:00 వరకు) మానవహారంలా రోడ్లపై నిలబడ్డారు. చూడటానికి రెండు కళ్లు చాలని ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ఏకంగా మూడు శాటిలైట్లు, నాలుగు విమానాలు, రెండు హెలికాప్టర్లు, 40 డ్రోన్లను వినియోగించారు. ఇస్రోకు చెందిన రెండు శాటిలైట్లతోపాటు ఒక విదేశీ శాటిలైట్‌ కూడా ఈ భారీ మానవహారాన్ని ఫొటోలు తీశాయని ప్రభుత్వాధికారులు తెలిపారు.

పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ​ కుమార్‌, మిత్రపక్షం ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌యాదవ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన నాయకులు మానవహారం కట్టారు. కొద్ది రోజుల కిందట బిహార్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. నితీశ్‌ సర్కారు అమలు చేస్తోన్న మద్యనిషేధాన్ని మెచ్చుకోవడమేకాక దేశానికి ఆదర్శంగా నిలిచారని కితాబు ఇవ్వడం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు సీఎం నితీశ​ కుమార్‌.. 2016, ఏప్రిల్‌ 5 నుంచి మద్యనిషేధాన్ని అమలులోకి తెచ్చారు. నిర్ణయం అమలుపై మొదట్లో కొన్ని అవాంతరాలు, అనుమానాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తూ గడిచిన 10 నెలలుగా బిహార్‌లో మద్యనిషేధం పకడ్బందీగా అమలవుతుండటం విశేషం.






మరిన్ని వార్తలు