రోహింగ్యాలు: మాకు అతిపెద్ద సవాల్‌!

7 Sep, 2017 11:27 IST|Sakshi
రోహింగ్యాలు: మాకు అతిపెద్ద సవాల్‌!

నేపితా: మయన్మార్‌లో ముదురుతున్న రోహింగ్యాల సంక్షోభంపై ఆ దేశ ప్రభుత్వ కౌన్సిలర్ ఆంగ్‌సాన్‌ సూచీ స్పందించారు. 'ఇది మాకు అతిపెద్ద సవాలు..కేవలం ప్రభుత్వంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఈ సవాలును మేం పరిష్కరించాలనడం సహేతుకం కాదు' అని ఆమె ఏఎన్‌ఐ వార్తాసంస్థతో అన్నారు. 'రఖైన్‌ రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా.. సామ్రాజ్యవాద బ్రిటిష్‌ పాలనకు ముందునుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రోహింగ్యా ముస్లింలలో ఉగ్రవాదులెవరో, సామన్యులెవరో మేం గుర్తించాల్సి ఉంది. ఈ సమస్య గురించి భారత్‌కు బాగా తెలుసు' అని ఆమె అన్నారు.

'మా పౌరులను కాపాడటం మా కర్తవ్యం. అందుకు మేం తీవ్రంగా కృషిచేస్తున్నాం. కానీ మాకు తగినంతగా వనరులు అందుబాటులో లేవు. ప్రతి ఒక్కరికీ చట్టబద్ధమైన రక్షణ లభించేలా మేం చూడాలనుకుంటున్నాం' అని సూచి అన్నారు. ప్రధాని మోదీ తాజాగా మయన్మార్‌ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో రోహింగ్యాల సంక్షోభంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. మయన్మార్‌ దేశ ఐక్యతను గౌరవిస్తూ రోహింగ్యాల సమస్య పరిష్కారానికి సంబంధిత పక్షాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సవాళ్లతో ఇబ్బందిపడుతున్న మయన్మార్‌కు భారత్‌ అండగా ఉంటుందని హామీనిచ్చారు. మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రంలో అతివాద హింస నేపథ్యంలో ఆ దేశ ఆందోళనల్ని భారత్‌ అర్థం చేసుకుందన్నారు. మయన్మార్‌ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్‌ సూచీతో ప్రధాని విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్‌ సైన్యం దాడులతో దాదాపు 1.25 లక్షల మంది బంగ్లాదేశ్‌కు వలసవెళ్లిన నేపథ్యంలో ప్రధాని ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

‘రఖైన్‌ రాష్ట్రంలో అమాయకులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అతివాద హింసపై మయన్మార్‌ ఆందోళనల్ని భారత్‌ అర్థం చేసుకుంది. మయన్మార్‌ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ సమస్యకు పరిష్కారం కోసం సంబంధిత పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలి’ అని మోదీ సూచించారు.

మరిన్ని వార్తలు