'చావురా.. చావు' అంటూ తిట్ల దండకం

16 Oct, 2015 16:55 IST|Sakshi
'చావురా.. చావు' అంటూ తిట్ల దండకం

జెరూసలెం: పదమూడేళ్ల బాలుడు నెత్తురోడుతూ నేల వాలిపోయాడు. బుల్లెట్ గాయాలతో  బాధపడుతున్న అతడి పట్ల కనికరం చూపాల్సింది పోయి.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి తిట్లు పురాణం విప్పాడు. 'చావురా.. చావు' అంటూ నెత్తుటి మడుగులో ఉన్న బాలుడిని తిట్టిపోశాడు. ఈ అమానుష వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఎప్పుడూ ఉప్పు-నిప్పులా ఉండే పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలను రేపుతున్నది. గత కొన్నాళ్లుగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న దాడులతో ఈ ప్రాంతంలో అశాంతి నెలకొనగా... తాజా వీడియోతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇద్దరు ఇజ్రాయిలీలపై కత్తితో దాడి చేశాడనే ఆరోపణలతో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడిపై ఇజ్రాయెల్ సైనికులు గత సోమవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దారుణంగా గాయపడ్డ బాలుడు అహ్మద్ మనస్రా అని, అతను చనిపోయాడని పాలస్తీనా చెబుతుండగా.. మరోవైపు అతడు బతికే ఉన్నాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఫొటోలు చూపించి ఇజ్రాయెల్ వాదిస్తున్నది. బాలుడిపై జరిగిన దారుణ దాడికి సంబంధించిన వీడియోను ఇటు ఇజ్రాయిలీలు, అటు పాలస్తీనా వాసులు పోస్టుచేసి.. తమదైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యాల క్రూరత్వానికి, పైశాచికిత్వానికి ఈ వీడియో పరాకాష్ట అని పాలస్తీనా వాసులు పేర్కొంటుండగా.. పాలస్తీనాకు చెందిన పదమూడేళ్ల బాలుడు నుంచి కూడా తమకు ముప్పు పొంచి ఉందనడానికి ఈ ఘటన నిదర్శనమని ఇజ్రాయిలీలు పేర్కొంటున్నారు.

ఇటీవల చోటుచేసుకున్న కత్తిపోటు ఘటనలు, హింసాత్మక ఆందోళనలు.. ఈ ప్రాంతంలో మళ్లీ తీవ్రస్థాయి తిరుగుబాటుకు దారితీసి.. మళ్లీ అశాంతి చోటుచేసుకునే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇటు పాలస్తీనా వాసులు, అటు ఇజ్రాయెల్ వాసులు ఆన్లైన్లో దాడులు, కాల్పులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తూ తీవ్రస్థాయి యుద్ధమే జరుపుతున్నారు.