కొత్త రాష్ట్రపతి ఎవరో?

14 Mar, 2017 18:49 IST|Sakshi
కొత్త రాష్ట్రపతి ఎవరో?

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో గెలవడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. మరో నాలుగు నెలల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు కావల్సిన బలం చాలావరకు ఎన్డీయేకు వచ్చేసింది. దాంతో ఇప్పుడు కొత్త రాష్ట్రపతి ఎవరవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఐదేళ్లు జూలై నెలలో ముగుస్తుంది. దాంతో ఈలోపుగానే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. తన గురుతుల్యులు, తాను ఈ స్థానానికి చేరుకునేందుకు వేలుపట్టి అడుగులు వేయించిన కురువృద్ధులు మురళీ మనోహర్ జోషి, ఎల్‌కే అద్వానీలలో ఎవరో ఒకరికి రాష్ట్రపతి పదవిని మోదీ కట్టబెడతారా.. లేక వాళ్లిద్దరూ కాకుండా వేరే ఎవరికైనా అవకాశం ఇస్తారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

తన తొలి నాళ్లలో ఢిల్లీ పార్టీ కార్యాలయంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ సాయంత్రం పూట మురళీ మనోహర్ జోషి చెప్పే పాఠాలను మోదీ వింటుండేవారు. 1992లో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జోషి మూడు రంగుల జెండా ఎగరేసినప్పుడు.. ఆయన పక్కనే మోదీ నిలబడ్డారు. అలాగే, మోదీ సంక్షోభంలో ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను తప్పించాలని తీవ్రంగా ఇంటా బయటా ఒత్తిడి వచ్చినా, ఎల్‌కే అద్వానీ మాత్రం మోదీకి గట్టి మద్దతుగా నిలబడి, ఆయనను ఆ పదవిలో కొనసాగేలా చేశారు. దాంతో వీళ్లిద్దరి పట్ల మోదీకి కృతజ్ఞతాభావం ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. అంతమాత్రాన వాళ్లలో ఒకరిని రాష్ట్రపతిగాను, మరొకరిని ఉప రాష్ట్రపతిగాను చేస్తారా అంటే.. అనుమానమేనని బీజేపీలో కొందరు నాయకులు అంటున్నారు. మహిళలు, దళితులు, గిరిజనులు లేదా ఆర్ఎస్ఎస్ సీనియర్లు.. వీళ్లలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. ఇందుకు తగినట్లుగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ మోదీ మాత్రం ఈ ఆలోచనలన్నింటికీ భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరుస్తారని కేంద్రంలోని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.

ఎన్ని ఓట్లు కావాలి..
రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టొరల్ కాలేజిలో మొత్తం 10,98,882 ఓట్లుంటాయి. అందులో సగం ఓట్లకు పైగా వస్తేనే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. అంటే, 5,49,442 ఓట్లు కావాలన్న మాట. ఉత్తరప్రదేశ్‌లో 321 స్థానాలు, ఉత్తరాఖండ్‌లో 57 స్థానాలతో పాటు మణిపూర్, గోవాలలో సాధించిన విజయాలతో ఎన్డీయే చాలావరకు ఈ సంఖ్యకు దగ్గరగా వచ్చింది. ఇక మరో 25,354 ఓట్లు సంపాదిస్తే చాలు.. రాష్ట్రపతి ఎన్నికకు మార్గం సుగమం అయిపోతుంది. శనివారం నాటి ఎన్నికల ఫలితాలకు ముందు ఈ తేడా 79,274గా ఉండేది. ఇప్పుడది గణనీయంగా తగ్గింది. మొత్తం అన్ని రాష్ట్రాలలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లతో ఎలక్టొరల్ కాలేజి ఉంటుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఇందులో ఓటుహక్కు ఉండదు. రాష్ట్ర జనాభాను బట్టి ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఓటుకు ఒక విలువ ఉంటుంది. ఉదాహరణకు ఎంపీలకు ప్రతి ఓటుకు గరిష్ఠంగా 708 విలువ ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208. యూపీ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కావడంతో కేవలం ఆ రాష్ట్రంలోనే మొత్తం 83,824 ఓట్లుంటాయి. ఇలా.. అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ల వాళ్ల ఓటు విలువను బట్టి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేస్తారు.

మరిన్ని వార్తలు