‘తుపాను’ భేటీ ముగిసింది!

14 Aug, 2015 02:00 IST|Sakshi
‘తుపాను’ భేటీ ముగిసింది!

పార్లమెంటు నిరవధిక వాయిదా
♦  వర్షాకాల సమావేశాలు ఆద్యంతం ప్రతిష్టంభన
♦  లలిత్‌గేట్‌పై చర్చ జరిగినా ఆందోళన వీడని కాంగ్రెస్
♦  చివరికి కాంగ్రెస్, లెఫ్ట్ సహా పలు పార్టీల వాకౌట్
♦  తుడిచిపెట్టుకుపోయిన సమావేశాలు
♦  పార్లమెంటును ప్రోరోగ్ చేయరాదని సర్కారు నిర్ణయం

న్యూఢిల్లీ: విపక్షాల దాడి, ప్రభుత్వ ఎదురు దాడితో తుపాను సమావేశాలుగా మారి.. దాదాపుగా స్తంభించిపోయిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి.

ముగియటానికి ఒక రోజు ముందు.. లలిత్ మోదీ వివాదంపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధంగా జరిగిన చర్చ మినహా.. ఈ సమావేశాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. లలిత్ మోదీ వివాదం, వ్యాపమ్ స్కాంపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ల రాజీనామాకు పట్టుపడుతూ.. విపక్షాలు - ప్రధానంగా కాంగ్రెస్, వామపక్షాలు ఆరంభం నుంచీ సభ కార్యకలాపాలను అడ్డుకోవటంతో.. కీలకమైన జీఎస్టీ సహా ఎటువంటి బిల్లులూ చేపట్టలేదు.

చివరి రోజైన గురువారమూ లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు.. కాంగ్రెస్, ఇతర విపక్షాలు.. సుష్మ, రాజే, శివరాజ్‌సింగ్‌లపై ఆరోపణలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. మరోవైపు.. రాజ్యసభ శాంతియుతంగా నిరవధిక వాయిదా పడటం విశేషం.
 
వర్షాకాల సమావేశాలు మొదలవటానికి ముందే.. ఈ సమావేశాలు అధికార, విపక్షాల మధ్య ఘర్షణతో తుడిచిపెట్టుకుపోనున్నాయన్న వాతావరణం ప్రస్ఫుటమైంది. జూలై 21న మొదలైన సమావేశాలు ఆ అంచనాలకు తగ్గట్లుగానే ప్రతిపక్షాల ఆందోళనలతో.. ప్రభుత్వం ఎదురుదాడితో గందరగోళంగా మారాయి.  కాంగ్రెస్  తన డిమాండ్లపై వెనక్కు తగ్గకపోవటం.. ప్రభుత్వం అందుకు ససేమిరా అంటూ మెట్టు దిగకపోవటంతో ఉభయసభలూ  స్తంభించిపోయాయి. ఆగస్టు 3న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ 44 మంది కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నందుకు ఐదు రోజులు సస్పెండ్ చేయటంతో అధికార - విపక్షాల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది.

ఈ సస్పెన్షన్‌ను నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు.. ఆ పార్టీకి సంఘీభావంగా మిగతా విపక్షాలన్నీ ఆ ఐదు రోజుల పాటు లోక్‌సభను బహిష్కరించాయి. లోక్‌సభలో ఆద్యంతం  గందరగోళం నెలకొన్నప్పటికీ.. కొన్ని రోజులు ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ నిర్వహించగలిగారు. అయితే.. ఎగువసభ అయిన రాజ్యసభలో మాత్రం ఎటువంటి కార్యకలాపాలూ సాగకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. సమావేశాలు ముగిసే సమయానికి ప్రభుత్వం రాజ్యసభలో వస్తువులు సేవల (జీఎస్టీ) బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ.. దానిపై సభా కార్యక్రమాల సలహా సంఘం(బీఏసీ)లో చర్చించలేదని చర్చను అడ్డుకుంది.

మొత్తంమీద.. ఈ సమావేశాల్లో ఉభయ సభల్లో  ప్రతిపక్షాల ఆందోళనల మినహా ఎలాంటి కార్యకలాపాలూ సాగలేదు. ఏ ఒక్క బిల్లుపైనా చర్చ జరగలేదు.  రాజ్యసభ  9 గంటలు మాత్రమే పనిచేసింది. 82 గంటల సమయం ఆందోళనలు, అవాంతరాలతో వృథా అయింది. రాజ్యసభలో రెండు బిల్లుల ఆమోదం/ తిప్పిపంపటం జరిగింది. లోక్‌సభ 47:27 గంటలు గందరగోళంలోనే పనిచేసింది. మరో 34:04 గంటలు వృథా అయ్యాయి. అయితే.. వృథా సమయాన్ని కొంతమేరకు పూడ్చుతూ 5:27 గంటలు అదనంగా సమావేశమైంది. లోక్‌సభలో 10 బిల్లులు ప్రవేశపెట్టి ఆరింటిని ఆమోదించారు. మోదీ సర్కారు హయాంలో ఇప్పటివరకూ జరిగిన పార్లమెంటు సమావేశాలు రికార్డు స్థాయిలో పనిచేయగా.. ప్రస్తుత సమావేశాలు తీవ్ర అవాంతరాలను ఎదుర్కోవటం విశేషం.
 
లోక్‌సభలో చివరి రోజూ అదే సీన్
లోక్‌సభ చివరి రోజు కూడా కాంగ్రెస్, లెఫ్ట్ నిరసనలతో దద్దరిల్లింది. విపక్ష సభ్యుల వాకౌట్ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. ఉదయం సభ  మొదలవగానే కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్, ఎస్‌పీ, ఆర్జేడీ సభ్యుల వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ గందరగోళంలోనే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. బుధవారం లలిత్‌మోదీ అంశంపై చర్చలో తానడిగిన ఏడు ప్రశ్నలకు సుష్మ సమాధానం చెప్పలేదని కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లికార్జునఖర్గే పేర్కొన్నారు.

ప్రధానమంత్రి సభకు వచ్చి.. సుష్మ, రాజే, శివరాజ్‌సింగ్‌లపై కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. అరగంట తర్వాత వారు, లెఫ్ట్, టీఎంసీ సభ్యులు వాకౌట్ చేశారు. ఎస్‌పీ అధ్యక్షుడు ములాయం సింగ్‌యాదవ్, ఆర్జేడీ సభ్యుడు జె.పి.ఎన్.యాదవ్‌లు కులగణన అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. వారి అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించటంతో వారూ  వాకౌట్ చేశారు. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తూ.. అవాంతరాల వల్ల చాలా సమయం కోల్పోయామని విచారం వ్యక్తంచేశారు.

కాగా,  రాజ్యసభను నిర్వహించటంలో, విస్తృత జాతీయ విధానాలపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని.. రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేస్తున్న పలువురు సభ్యులు పిలుపునిచ్చారు. రాజ్యసభ గురువారం సమావేశమైన తర్వాత.. సభ్యులు పి.కన్నన్ అక్టోబర్ 6న, నామినేటెడ్ సభ్యులు అశోక్ గంగూలీ, హెచ్.కె.దువాలు నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నట్లు చైర్మన్ హమీద్ అన్సారీ తెలిపారు. ముగ్గురు సభ్యులకూ రాజ్యసభ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తంచేస్తూ వీడ్కోలు పలికారు. అనంతరం నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.
 
జీఎస్టీ కోసం మళ్లీ భేటీ!
జీఎస్టీ బిల్లు ఆమోదంపై దృష్టి పెట్టిన కేంద్రం.. పార్లమెంటును మళ్లీ సమావేశపరిచే అవకాశాన్ని ఉంచుకుంటూ.. ఉభయసభలను తక్షణమే ప్రొరోగ్ చేయటానికి సిఫార్సు చేయరాదని నిర్ణయించింది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) గురువారం భేటీ అయి ఈ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ బిల్లుపై ఇతర పార్టీలు కలిసివచ్చే అవకాశాలు మెరుగుపడటంపై.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను తిరిగి కొనసాగించే అంశం ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకుని బిల్లును ముందుకు తేవాలని భావిస్తే.. వర్షాకాల సమావేశాలను తిరిగి ప్రారంభించి మరికొన్ని రోజులు నిర్వహించే అవకాశముంది. సభలను ప్రొరోగ్ చేయకుండా సభాపతులు నిరవధిక వాయిదా మాత్రమే వేసినట్లయితే.. ఆ భేటీలు కొనసాగుతాయి. ఎప్పుడైనా మళ్లీ సమావేశపరచవచ్చు.
 
భూసేకరణ ఆర్డినెన్స్ కోసం ప్రొరోగ్ చేస్తారా?
భూ సేకరణ ఆర్డినెన్స్‌పైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత నెల మూడోసారి జారీచేసిన ఈ ఆర్డినెన్స్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టం చేసేందుకు ఉద్దేశించిన బిల్లు ఇంకా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వద్దే ఉంది. ఈ బిల్లును పార్లమెంటు శీతాకాల భేటీల్లో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆర్డినెన్స్‌ను 4వసారి జారీచేయాలని సర్కారు భావిస్తే.. ఉభయసభల్లో ఒక సభను ప్రొరోగ్ చేయాల్సి ఉంటుంది.  ఆర్డినెన్స్‌కు 6నెలల పరిమితి ఉన్నప్పటికీ..ఆర్డినెన్స్ జారీ తర్వాత భేటీ అయ్యే పార్లమెంటు.. దాన్ని 6 వారాల్లోగా ఆమోదించాల్సి ఉంటుంది. సమావేశాలు కొనసాగుతున్నపుడు ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయొద్దు.

మరిన్ని వార్తలు