పార్లమెంట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అంశంలో కీలక పరిణామం | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీ అంశంలో కీలక పరిణామం

Published Thu, Sep 28 2023 6:54 PM

Parliament Panel Move Against BJP MP Ramesh Bidhuri - Sakshi

ఢిల్లీ: పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ స‌భ్యుడు ర‌మేష్ బిధూరి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే. కాగా, బిధూరి వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బీజేపీ ఎంపీ రమేష్‌ బిధూరిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని విప‌క్షాలు డిమాండ్ చేయ‌డంతో బీజేపీ హైకమాండ్‌ రంగంలోకి దిగింది. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ కోరుతూ పార్టీ అగ్ర‌నాయక‌త్వం ర‌మేష్ బిధూరికి నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వివాదాన్ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా స‌భా హ‌క్కుల క‌మిటీకి నివేదించారు. ర‌మేష్ బిధూరి వ్యాఖ్య‌ల ప‌ట్ల కాంగ్రెస్ నేత అధీర్ రంజ‌న్ చౌధ‌రి, డీఎంకే ఎంపీ క‌నిమొళి స‌హా ప‌లువురు విప‌క్ష ఎంపీలు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో, వీరి ఫిర్యాదుల‌ను బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ సార‌ధ్యంలోని స‌భా హ‌క్కుల క‌మిటీకి స్పీక‌ర్ పంపించారు. ఈ వ్య‌వ‌హారాన్ని స‌భా హ‌క్కుల క‌మిటీకి రిఫ‌ర్ చేసినందుకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీక‌ర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ ర‌మేష్ బిధూరికి కాషాయ పార్టీ కీల‌క ఎన్నిక‌ల బాధ్య‌త‌లు అప్పగించడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ‌స్ధాన్‌లోని టోంక్ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల ఇన్‌చార్జ్‌గా ర‌మేష్ బిధూరిని నియ‌మించ‌డం ప‌ట్ల బీజేపీపై విమ‌ర్శలు వెల్లువెత్తాయి. విద్వేష వ్యాఖ్య‌లు చేసే వారికి బీజేపీ ప‌ట్టం క‌డుతుంద‌ని రాజ్య‌స‌భ ఎంపీ క‌పిల్ సిబ‌ల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టోంక్‌లో ముస్లిం జ‌నాభా 29 శాతమ‌ని, రాజ‌కీయ ల‌బ్ధి కోసం విద్వేష విషం వెద‌జ‌ల్లుతున్నార‌ని తీవ్ర విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: భారత తొలి ప్రధాని నెహ్రు కాదు.. బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్‌ కామెంట్స్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement