రుణమాఫీపై సీఎం సంచలన నిర్ణయం?

3 Apr, 2017 08:04 IST|Sakshi
రుణమాఫీపై సీఎం సంచలన నిర్ణయం?

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకోడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు కోటిన్నర మంది చిన్నకారు, సన్నకారు రైతులకు రుణమాఫీ చేసే విషయమై ఈ వారంలో నిర్ణయం తీసుకోనున్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కోటిన్నర మంది రైతులతో కూడిన జాబితాను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి పంపినట్లు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ సాహి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రైతు రుణమాఫీ. ప్రభుత్వం ఏర్పాటు కాగానే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలోనే పడ్డామని సాహి వివరించారు.

రైతుల నుంచి దాదాపు 80 లక్షల టన్నుల గోధుమలను కొనుగోలు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా గోధుమ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు తమ పొలాల నుంచి ఏడు కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఉండే విధంగా ఈ కేంద్రాలు ఉంటాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం కేవలం 40 లక్షల టన్నుల గోధుమలే పండించాలని రైతులకు చెప్పిందని, కానీ తమ ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసిందని మంత్రి అన్నారు. గోధుమలకు కనీస మద్దతుధర క్వింటాలుకు రూ. 1625 చొప్పున నిర్ణయించామన్నారు.

మూసేసిన, వాడకుండా వదిలేసిన కోల్డ్ స్టోరేజిలను గోధుమల నిల్వకు ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు మంత్రి సాహి తెలిపారు. ప్రస్తుతమున్న గోడౌన్ల సామర్థ్యం 40 లక్షల టన్నులే ఉందని, అది సరిపోదు కాబట్టి మరింత నిల్వ సామర్థ్యం కోసం ఇలా ఆలోచిస్తున్నామని అన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామన్న ప్రధాని నరేంద్రమోదీ హామీ ఈ రకంగా నెరవేరుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు