విలాసాల కోసం పోలీసునంటూ ..

5 Apr, 2017 21:16 IST|Sakshi

రేణిగుంట: విలాసాలకు మరిగి రైలు ప్రయాణికులను దోచుకుంటున్న ఓ అంతర్‌రాష్ట్ర నేరస్తుడి ఆటకట్టించారు. చిత్తూరు జిల్లా  రేణిగుంట పోలీసులు తెలిపిన వివరాలివీ.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన అనిల్‌కుమార్‌ అలియాస్‌ నాని(37) పాతనేరస్తుడు. విలాసాలకు అలవాటు పడిన ఇతడు దోపిడీలకు పాల్పడుతుంటాడు. కొంతకాలంగా అనిల్‌కుమార్‌ రేణిగుంట అంకమనాయుడుమిట్టలో నివసిస్తున్నాడు. నిత్యం స్థానిక రైల్వే స్టేషన్, పాత రేణిగుంటప్రాంతంలో సంచరిస్తూ పలువురిని బెదిరించి దోచుకుంటున్నాడు.

కడప నగరం హుజూపేటకు చెందిన అమీర్‌బాష అనే బంగారు వ్యాపారి జనవరి 19వ తేదీన తెల్లవారుజామున రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకుని చెన్నై రైలు కోసం వేచి ఉన్నాడు. ఆ సమయంలో అనిల్‌కుమార్, సందీప్‌ అనే యువకుడు అమీర్‌బాష వద్దకు వచ్చి తాము పోలీసులమని, ఎస్‌ఐ పిలుస్తున్నాడని బెదిరించారు. ద్విచక్ర వాహనంపై అతడిని ఎక్కించుకుని పాత చెక్‌పోస్టు సమీపంలోని అండర్‌బ్రిడ్జ్‌
వద్దకు తీసుకెళ్లారు. మెడపై కత్తిపెట్టి బెదిరించి అతని వద్దనున్న రూ.5లక్షలు దోచుకుని పారిపోయారు. అలాగే, సికింద్రాబాద్‌ మల్కాజ్‌గిరి ప్రాంతంవెంకటాపురానికి చెందిన వెంకటేశ్వర్లు శ్రీకాళహస్తి మండలం తొండమనాడులో నివసిస్తున్నాడు.

గతేడాది డిసెంబర్‌ 11వ తేదీన తిరుమలకు వెళుతూ రేణిగుంట పాతచెక్‌పోస్టు సమీపంలో కాలకృత్యాలు తీర్చుకుంటుండగా పోలీసునని బెదిరించి అతని వద్దనున్న రూ.1.5లక్షలు దోచుకెళ్లాడు. అంతేకాకుండా అనిల్‌కుమార్‌పై బిట్రగుంట పోలీసుస్టేషన్‌లో 8 దొంగతనం కేసులు, తిరుపతి క్రైం స్టేషన్‌లో మూడు కేసులు నమోదై ఉన్నాయి. నిందితుడు అనిల్‌కుమార్‌తోపాటు అతనికి సహకరించిన సందీప్‌ను మంగళవారం సాయంత్రం అంకమనాయుడుమిట్ట ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న రూ.2.10లక్షలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించామని అర్బన్‌ సీఐ బాలయ్య తెలిపారు.

>
మరిన్ని వార్తలు