మరో ‘మార్పిడి’ యత్నం! | Sakshi
Sakshi News home page

మరో ‘మార్పిడి’ యత్నం!

Published Thu, Jan 18 2024 5:54 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్‌ ఉదంతం స్ఫూర్తితో ఓ యువ వ్యాపారవేత్త కూడా ఇలాంటి ఎస్కేప్‌కే ప్లాన్‌ చేశాడు. ప్రమాదం చేసిన తన స్థానంలో స్నేహితుడిని ఉంచాలని చూశాడు. పోలీసుల అప్రమత్తత, దర్యాప్తు నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చి ఇద్దరూ జైలుకు వెళ్ళారు. గత ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌కు చెందిన యువ వ్యాపారి యల్లందు శ్రీకాంత్‌ అక్కడి నోవాటెల్‌లో ఉన్న పబ్‌లో మద్యం తాగాడు. ఆదివారం తెల్లవారుజామున స్నేహితుడిని దిగబెట్టడానికి పంజగుట్టకు తన బీఎండబ్ల్యూ కారులో (టీఎస్‌07సీహెచ్‌2345) వచ్చాడు. అతడిని దించిన తర్వాత తిరిగి మాదాపూర్‌కు మితిమీరిన వేగంతో వెళ్తున్నాడు.

తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ వాహనం బంజారాహిల్స్‌ రోడ్డు నెం.3లో ఉన్న మసీదు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పింది. మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్‌ కారు అదుపు చేయలేకపోయాడు. దీంతో వాహనం వేగంగా మసీదు గోడను ఢీ కొట్టింది. ఎయిర్‌ బెలూన్లు తెరుచుకోవడంతో శ్రీకాంత్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. తాను మద్యం తాగి ఉండటంతో పోలీసులకు చిక్కితే ఇబ్బందులు వస్తాయని భావించాడు. ఈ ప్రమాదం విషయం తన స్నేహితుడైన అమీర్‌పేట వాసి నాగార్జునకు ఫోన్‌ చేసి చెప్పాడు. కేవలం 15 నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్నాడు. తన స్థానంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లాలని, కోర్టు ఖర్చులతో పాటు ఇతర అంశాలను తాను చూసుకుంటానని చెప్పాడు. దీనికి అంగీకరించిన నాగార్జున అక్కడే ఉండిపోగా..శ్రీకాంత్‌ కాస్త దూరం వెళ్లి కాపుకాశాడు.

ఆ సమయంలో ఘటనాస్థలికి వచ్చిన బంజారాహిల్స్‌ పోలీసులతో ప్రమాదం జరిగిన సమయంలో తానే వాహనం నడుపుతున్నట్లు నాగార్జున చెప్పాడు. ఓ పబ్‌ నుంచి మాదాపూర్‌ వెళ్తుండగా అదుపు తప్పి ఇలా జరిగిందని చెప్పాడు. దీంతో పోలీసులు నాగార్జునను బంజారాహిల్స్‌ ఠాణాకు తరలించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డీఐ) జాకీర్‌ హుస్సేన్‌ నాగార్జునకు శ్వాస పరీక్షలు నిర్వహించి, మద్యం తాగి ఉన్నాడా? లేదా? అనేది తెలుసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసు సిబ్బంది ఈ ప్రయత్నాల్లో ఉండగా శ్రీకాంత్‌ ఠాణా వద్దకు చేరుకున్నాడు. అతడిని చూసిన జాకీర్‌ హుస్సేన్‌ ఎవరంటూ ప్రశ్నించారు. దీంతో తన పేరు శ్రీకాంత్‌ అని, నాగార్జున స్నేహితుడినని, ప్రమాదం విషయం తెలిసి వచ్చానని చెప్పాడు.

ఇటీవల జరిగిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్‌ ఉదంతం నేపథ్యంలో శ్రీకాంత్‌ వ్యవహారశైలినీ అనుమానించి డీఐ జాకీర్‌ హుస్సేన్‌ లోతుగా ఆరా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఘటనాస్థలితో పాటు ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరిగిన సమయంలో కారును శ్రీకాంత్‌ నడిపాడని, ప్రమాదం తర్వాత నాగార్జున అక్కడకు వచ్చాడని గుర్తించారు. వెంటనే ఇద్దరినీ పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించారు.

తాను ప్రమాదం చేశానని, అయితే మద్యం తాగి ఉండటంతో కేసుకు భయపడ్డానని చెప్పాడు. మద్యం తాగి లేని నాగార్జునను తన స్థానంలో ఉంచాలని ప్రయత్నించానని అంగీకరించాడు. దీంతో జాకీర్‌ హుస్సేన్‌ ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ డి.సంతోష్‌కుమార్‌ను ఇరువురిపైనా ఫిర్యాదు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈయన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌, నాగార్జునలపై ఐపీసీలోని 308, 427, 279, 203, 419, 34, మోటారు వాహనాల చట్టంలోని 184, 185, 187 కింద కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్టు చేసిన బంజారాహిల్స్‌ అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement